
మారుమూల పల్లెలకూ ప్రతి రోజూ శుద్ధజలం
తీరిన దశాబ్దాల గోస.. తగ్గుముఖం పట్టిన రోగాలు
ఆనందంలో అడవిబిడ్డలు..
సీఎంకు దీవెనలు కాంగ్రెస్‌వి మాయమాటలు
ఆదిలాబాద్, ఆగస్టు 12( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ప్రజల తాగు నీటి గోస తీర్చింది. కొండ కోనల మధ్యనున్న గూడేలు, తండాల్లోనూ నల్లాలు బిగించి నీరు సరఫరా చేస్తుండగా గిరిజనం మురిసిపోతున్నది. గత పాలకుల పట్టింపులేని తనంతో చెలిమెలపై ఆధారపడి రోగాల బారిన పడ్డ వారంతా, నేడు తెలంగాణ సర్కారు అందిస్తున్న శుద్ధజలం తాగుతూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. తెలంగాణ వచ్చి.. కేసీఆర్ సీఎం అయిన తర్వాత తమ దశాబ్దాల కల నెరవేర్చారని, కాలినడకన కిలోమీటర్ల కొద్దీ నడిచే బాధ తప్పించి ఇంటి వద్దకే స్వచ్ఛమైన నీరు తీసుకొచ్చారని, ఆయన సల్లంగా ఉండాలని అడవిబిడ్డలు దీవిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో అడవులు, కొండలు, గుట్టల మధ్య గూడేలు, తండాలు ఎక్కువగా ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో అడవిబిడ్డల తాగు నీటి తిప్పలను పట్టించుకున్న నాథుడే లేకుండే. దశాబ్దాల పాటు వాగులు, ఒర్రెల్లోని చెలిమెల నీటిని తెచ్చుకొని దాహం తీర్చుకునే వారు. కలుషితమైన నీటిని తాగడం వల్ల వివిధ రకాల వ్యాధుల బారిన పడేవారు. వానకాలంలో అయితే డయేరియా, ఇతర వ్యాధులు పట్టి పీడించేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఆదిలాబాద్ జిల్లా పాలిట వరంగా మారింది. జిల్లాలోని అటవీ ప్రాంతాలతో పాటు ఎత్తైన కొండలు, గుట్టల మధ్య ఉన్న గ్రామాలకు సైతం శుద్ధం జలం అందిస్తున్నారు. ట్యాంకులు నిర్మించి.. ఇంటింటికీ నల్లాలు బిగించి నీరు అందిస్తున్నారు. ఒక్కొక్కరికి రోజూ 100 లీటర్ల చొప్పున నీరు అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కుమ్రంభీ ప్రాజెక్టుల ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాలకు తాగునీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు.
1126 గ్రామాలకు తాగునీరు
జిల్లాలో రూ. 334 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టారు. ప్రాజెక్టు నుంచి 1990 కిలోమీటర్ల గ్రీడ్ పైపులైన్ వేశారు. 936 మంచినీటి ట్యాంకులను నిర్మించడంతో పాటు 1857 కిలోమీటర్లు అంతర్గత పైప్‌లైన్ వేసి 150290 ఇండ్లకు నల్లానీటిని అందిస్తున్నారు. జిల్లాలోని 401 గ్రామాలకు కుమ్రంభీం ప్రాజెక్టు ద్వారా, 725 గ్రామాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు.
ఓర్వలేకే కాంగ్రెస్ ఆరోపణలు
ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం తాగునీరు అందిస్తుండగా, కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడడం లేదు. సోమవారం ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత-గిరిజన దండోరా సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మిషన్ భగీరథ పథకంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా తమ దశాబ్దాల కల నెరవేరిందని, నాడు కలుషిత నీరు తాగడం వల్ల రోగాల బారిన పడేవారమని, ఇప్పుడు సీఎం కేసీఆర్ పుణ్యమాని మా తిప్పలు తప్పాయని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
50 ఇండ్లకు నీళ్లిత్తన్రు
ఎన్నో ఏండ్ల సంది గీ గూడెంలనే ఉంటున్నం. మునుపు గుట్టలు దాటుకొని చిన్న బావి నుంచి నీళ్లు తెచ్చుకొని తాగేటోళ్లం. ఇగ వానకాలమైతే మస్తు తిప్పలయ్యేది. ఎండాకాలమైతే ఇగ మా గోస చూడాలె. ఎవుసం పనులన్నీ వదిలేసుకొని బిందెడు నీళ్ల కోసం తిరిగేటోళ్లం. ఒకప్పుడు మా నీటి గోస తీర్చాలని సార్ల చుట్టూ తిరిగినం. ఎవ్వరూ పట్టించుకోలె.. ఇగ మా తలరాత ఇంతేననుకొని వెళ్లదీసినం. తెలంగాణ వచ్చి.. కేసీఆర్ సార్ సీఎం అయినంక.. మా తిప్పలు పోయినయ్. పైప్‌లైన్ వేసి 50 ఇండ్లకు తాగు నీళ్లిత్తన్రు. గాయనకు జీవితాంతం రుణపడి ఉంటం.