
ముఖ్య అతిథులుగా సినీ నటి అనుపమ, మంత్రి అల్లోల
భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు
నిర్మల్ అర్బన్, ఆగస్టు 12 : నిర్మల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిసాన్ వస్త్ర దుకాణాన్ని గురువారం అంగరంగ వైభవంగా ప్రారంబించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నటి అనుపమ పరమేశ్వరన్ ముఖ్య అతిథులుగా హాజరై దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా ఏర్పాటు కావడంతో మహానగరాల్లో ఉండే వస్త్ర దుకాణాలు ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తప్పాయని, స్థానికులందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయన్నారు. అనంతరం దుకాణాన్ని పరిశీలించారు. మంత్రి అల్లోలను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, స్థానిక కౌన్సిలర్ అడ్ప విజయలక్ష్మీపోశెట్టి, ప్రముఖ వ్యాపార వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నటి అనుపమ సందడి..
సినీనటి అనుపమ పరమేశ్వరన్ కిసాన్ వస్త్ర దుకాణ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. విషయం తెలుసుకున్న అభిమానులు ఉదయం నుంచే దుకాణం ఎదుట బారులుతీరారు. శ్రావణ మాసం సందర్భంగా నిర్మల్ పట్టణానికి మొదటిసారిగా రావడం చాలా సంతోషంగా ఉందని నటి అనుపమ అన్నారు. పెద్దఎత్తున అభిమానులు ఇక్కడ ఘన స్వాగతం పలకడం ఎప్పటికీ మరిచిపోలేనని పేర్కొన్నారు. నిర్మల్ చరిత్రను వినడమే కానీ చూడడం ఇదే మొదటి సారని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నో అందాలకు నిలయమని, ఇక్కడ అనేక సినిమాలు తీశారని, భవిష్యత్లో తాను నటించబోయే సినిమాలో దర్శక నిర్మాతలతో చర్చించి ఇక్కడ సినిమా షూటింగ్ చేసేలా చూస్తానన్నారు.