
18-35 ఏళ్లలోపు ఉన్న యువతీయువకులకు సదావకాశం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్వే పూర్తి.. 376 మంది గుర్తింపు..
శిక్షణ కాలంలో ఒక్కొక్కరికి రూ.237 చొప్పున రూ. 21వేల స్కాలర్ షిప్
15 నుంచి 90 రోజులపాటు తర్ఫీదు
నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు
సారంగాపూర్, డిసెంబర్ 11 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వంద రోజులు పని పూర్తి చేసిన కుటుంబాల యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సర్కారు భావిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి మండలానికి కనీసం 25 మందిని గుర్తించి తర్ఫీదు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఉపాధి హామీ పథకం, సెర్ప్ సిబ్బందితో ఇంటింటా సర్వే నిర్వహించి, 376 మందిని గుర్తించారు. వీరికి ఈనెల 15 నుంచి శిక్షణ ఇవ్వనుండగా.. శిక్షణ కాలంలో యూనిఫాం, హాస్టల్ వసతి, రోజు రూ.237 చొప్పున 90 రోజులకు ఒక్కొక్కరికి రూ.21 వేలు స్కాలర్షిప్ చెల్లించనున్నారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 2018-19 సంవత్సరంలో వంద రోజుల పని పూర్తి చేసుకున్న కుటుంబాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిరుపేద కుటుంబాల్లోని యువతీయువకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ‘ఉన్నతి’ పేరిట కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నది. ఆయా కుటుంబాల్లోని 18-35 ఏళ్లలోపు వారు ఎంచుకున్న ఉపాధి రంగంలో శిక్షణ ఇవ్వనున్నారు. పది, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు డ్రైవాల్, పాల్స్ సీలింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, కన్స్ట్రక్షన్ సూపర్ వైజర్స్, పెయింటింగ్ అండ్ డిస్ట్రిన్షన్, ప్లంబింగ్ అండ్ శానిటేషన్, స్టోర్ కీపర్, వెల్డింగ్, ల్యాండ్ సర్వేయర్, జూనియర్ మెకానిక్ హైడ్రాలిక్, ట్రాన్స్బ్ సెల్ఫ్ లోడింగ్ మిక్చర్ ఆపరేటర్, ఇంగ్లిష్ వర్క్ రెడినెస్ అండ్ కంప్యూటర్, లైఫ్, సాఫ్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్, రిటైల్ మార్కెటింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి వాటిపై తర్ఫీదు ఇవ్వనున్నారు. అనంతరం సర్టిఫికెట్ ప్రదానం చేసి, ఉపాధి కల్పించనున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా కార్యక్రమం నిర్వహించకపోగా.. ప్రస్తుతం నిరుపేద యువతను ప్రోత్సహించేందుకు మళ్లీ ‘ఉన్నతి’ కోసం నిర్వహించిన సర్వే కూడా పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లాలో 23, నిర్మల్ జిల్లాలో 180, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 98, మంచిర్యాల జిల్లాలో 75 మంది చొప్పున మొత్తం 376 మందిని గుర్తించారు.
డిసెంబర్ 15 నుంచి ప్రత్యేక తర్ఫీదు
‘ఉన్నతి’ పథకం కోసం ఎంపికైన యువతకు డిసెంబర్ 15 నుంచి ఆయా రంగాల్లో 90 రోజులపాటు నాలుగు ప్రభుత్వ సంస్థలు శిక్షణ ఇవ్వనున్నాయి. ఇందులో NAC (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్), EWRC(ఇంగ్లిష్ వర్క్ రెడీనెస్ అండ్ కంప్యూటర్) డీఆర్డీఏ ద్వారా, RSETI (స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం) ఎస్బీఐ ద్వారా, వ్యవసాయ పరిజ్ఞాన పెంపు శిక్షణ KVK ఆదిలాబాద్ ద్వారా తర్ఫీదు ఇస్తారు. మహిళలకు నిర్మల్ జిల్లాలోని మహిళా ప్రాంగణంలో, పురుషులకు జగిత్యాల, హైదరాబాద్ వంటి జిల్లాల్లో శిక్షణ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నైపుణ్య శిక్షణకు ఎంపికైన వారికి ఉచిత శిక్షణ, యూనిఫాం, హాస్టల్ వసతి ఉంటుంది. అలాగే రోజూ రూ.237 చొప్పున 90 రోజులకు ఒక్కొక్కరికి రూ.21 వేలు ఆయా మండలాల ఎంపీడీవోల ద్వారా చెల్లిస్తున్నామని నిర్మల్ జిల్లా డీఆర్డీఏ వెంకటసాయి ప్రసాద్ తెలిపారు.