
రాష్ట్రం వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా 6వ స్థానం
జాతీయ లోక్ అదాలత్‌కు భారీ స్పందన
ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత
ఎదులాపురం, డిసెంబర్ 11 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోర్డుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు మంచి స్పందన వచ్చింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. కోర్డులో కక్షిదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ముందుగా డీఎల్ఎస్ఏ సమావేశమందిరంలో న్యాయమూర్తులు, పీపీలు, న్యాయవాదులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి , డీఎల్ఎస్ఏ చైర్పర్సన్ మంత్రి రామకృష్ణ సునీత మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవడంతో ఇరువురికీ న్యాయం చేకూరుతుందన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో 12,074 కేసులు పరిష్కారమయ్యా యని పేర్కొన్నారు. ఇందులో ప్రీ లిటిగేషన్ కేసులు (పీఎల్ సీ) 1616, కోర్టు పెండింగ్ కేసులు 10,458 కేసులు పరిష్కరించడంతో ఉమ్మడి జిల్లా 6వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు శ్రీనివాస్‌రావు, జయప్రసాద్, ఉదయ్‌భాస్కర్, క్షమాదేశ్‌పాండే, యశ్వంత్‌సింగ్ చౌహాన్, మంజుల, పీపీలు ఎం.రమణారెడ్డి, సంజయ్ కుమార్వైరాగ్రె, న్యాయవాదులు పాల్గొన్నారు.
రూ.7లక్షల బీమా బాండ్ అందజేత
ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ సమీపంలో 31, జనవరి 2020న బైక్‌ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పి.అనిల్ (19) మృతి చెందాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు వాదోపవాదాలు కోర్టులో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ లోక్ అదాలత్‌కు ఇరువురు తమ సమస్య పరిష్కరించాలని విజ్ఞాపన చేసుకున్నారు. జిల్లాకోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు బాధితులు, మృతుడు అనిల్ తల్లిదండ్రులైన పీ ప్రకాశ్, రాధాబాయి, న్యూ ఇండియా అస్యూరెన్స్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు, బాధితుల తరుఫున న్యాయవాది కే సంజయ్ కుమార్ రెడ్డి, బీమా కంపెనీ ప్రతినిధుల తరుఫున న్యాయవాది మోహన్ సింగ్ హాజరయ్యారు. వీరంతా కలిసి పరస్పర అంగీకారానికి వచ్చారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రకారం బాధితులకు రూ.7లక్షలు పరిహారంగా ఇవ్వడానికి బీమా కంపెనీవారు అంగీకరించారు. ఈ నిర్ణయం తమకు సమ్మతమేనని బాధితులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత ముందు ఒప్పుకున్నారు. దీంతో డీఎల్ఎస్ఏ సమావేశ మందిరంలో మొదటి కేసు పరిష్కారమైంది. దీంతో బాధితులు హర్షం వ్యక్తంచేశారు.
విడిపోయే జంటను ఒకటి చేసి..
ఆదిలాబాద్ జిల్లా కోర్టులో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌లో విడిపోయే వరకు వచ్చిన ఒక జంట తిరిగి ఏకమైంది. జైనథ్ మండలం బాలాపూర్ గ్రామానికి చెందిన జక్కుల భరత్-గీతకు 2017లో పెళ్లయింది. వీరికి ఓ పాప కూడా ఉంది. మూడేళ్ల వరకు కలిసి ఉన్న వీరు ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోవాలని అనుకున్నారు. దీంతో 2020లో విడాకుల కోసం కోర్టులను ఆశ్రయించారు. కక్షిదారుడు జక్కుల భరత్ తరఫున ఎన్.నగేశ్, జక్కుల గీత తరఫున కేమా శ్రీకాంత్ కేసు వాదించారు. విడిపోయే జంటను కలిపేందుకు మరోసారి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆమె చెప్పిన మాటలకు సమ్మతించి మళ్లీ కలిసుండాలని నిశ్చయించుకున్నారు. వెంటనే దండలు తెప్పించి మరో సారి దంపతులతో మార్పించారు. విడిపోతున్న తమను కలిపినందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి, న్యాయమూర్తి జయప్రసాద్, క్షమాదేశ్ పాండే, ఉదయ్ భాస్కర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
సద్వినియోగం చేసుకోండి..
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 11 : లోక్ అదాలత్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా అదనపు న్యాయమూర్తి హరీష అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ ని ర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాజీతోనే రాచమార్గమన్నారు. దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని పలు కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. బ్యాంకుకు సంబంధించి 16 కేసులు పరిష్కరించుకొని రూ.8.32 లక్షలు రికవరీ చేశామని చెప్పారు. భూ తగాదా కేసులు 2, వెయ్యి క్రిమినల్ కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు.