
ఆదిలాబాద్, అక్టోబర్ 11 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పత్తి కొనుగోళ్లకు యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఉమ్మడి జిల్లాలో 10.35 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఇప్పటికే దూది తీత మొదలైంది. 70 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తుండగా, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నది. నాలుగు జిల్లాల్లో 24 సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కేంద్రాలు ఏర్పాటు చేసి, క్వింటాల్‌కు రూ.6025 చొప్పున మద్దతు ధర కల్పించనున్నది. దసరా తర్వాత సేకరణ ప్రారంభించే అవకాశముండగా, నేడు ఆదిలాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తాపట్నాయక్ సంబంధిత అధికారులు, ఎమ్మెల్యేలతో వివిధ అంశాలపై చర్చించనున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సీజన్లో పత్తి పంటను ఎక్కువగా సాగుచేస్తారు. అధిక వర్షపాతం, నల్లరేగడి భూ ములతో పాటు అనుకూలమైన వాతావరణం ఉండడంతో క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10.35 లక్షల ఎకరాల్లో పత్తి పం టను వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల ఎకరాలు, నిర్మ ల్ జిల్లాలో 1.80 లక్షలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2.95 లక్షలు, మంచిర్యాల జి ల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. ఇటీవల కురిసిన వర్షాలతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో దిగుబడులు కొద్దిగా తగ్గే అవకాశాలున్నాయి. ఎకరాకు 7 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని రైతులు అంటున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 70 లక్షల క్వింటాళ్ల పంట విక్రయానికి రానుండగా దసరా పండుగ తర్వాత సేకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
పంట కొనుగోళ్లకు ఏర్పాట్లు
ఆదిలాబాద్ పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీనికి బహిరంగా మా ర్కెట్లో ఎక్కువ ధర వచ్చే అవకాశాలున్నా యి. గతేడాది క్వింటాలుకు మద్దతు ధర రూ.5825 ఉండగా, వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తుండడంతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 24 కేంద్రాల్లో 52 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది మద్దతు ధర క్వింటాలుకు మరో రూ.200 పెంచి రూ.6025తో కొనుగోలు చేయనున్నది. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో క్వింటాలుకు రూ.7 వేల తో కొనుగోలు చేస్తుండగా, జి ల్లాలో సైతం ఈసారి మద్దతు ధర కంటే రూ.500 వరకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లాలో సీసీఐ ( కాటన్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా)ని మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లను చేపట్టనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాల్లో కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు జిన్నింగ్‌లను సీసీఐ అద్దెకు తీసుకోగా, మిగిలిన చోట్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
నేడు ఆదిలాబాద్ లో సమావేశం
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం వ్యాపారులు, సీసీఐ, మార్కెటింగ్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఆదిలాబాద్, బోథ్ ఎమెల్యేలు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. కొనుగోళ్లు ఎప్పటి నుంచి ప్రారంభించాలి, తేమ శాతం, రైతులకు ఇబ్బందుల్లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయాలని విషయాలపై చర్చించనున్నారు. పంట విక్రయానికి వచ్చేటప్పుడు రైతులు పట్టాపాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్సు తీసుకురావాల్సి ఉంటుంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యలో ఇటీవల పంటల సర్వే చేపట్టి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. దీని ఆధారంగా పంటను కొనుగోలు చేస్తారు.