
గుడిహత్నూర్, అక్టోబర్ 11: ఐఎఫ్ఎస్ అధికారినని, అటవీశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసగించిన వ్యక్తితో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజలను నమ్మించడమే కాకుండా పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేశారు. నకిలీ జాయినింగ్ సర్టిఫికెట్లు అంటగట్టి తప్పించుకు తిరుగుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి రాగా.. ఆదివారం రాత్రి పోలీసులు వలపన్ని నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి నగదు, నకిలీ సర్టిఫికెట్లు, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర వివరాలు వెల్లడించారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి తప్పించుకుతిరుగుతున్నా కేటుగాళ్లను ఆరెస్టు చేసినట్లు ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. గుడిహత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన పర్చే మోహన్ డిగ్రీ ఫెయిలై పెయింటర్‌గా పని చేసేవాడు. గత రెండేళ్లుగా తాను ఐఏఫ్ఎస్ అధికారినంటూ అటవీ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడు. వీరికి ఫారెస్టు బీట్ , ఫారెస్టు సెక్షన్ అధికారులుగా నకిలీ నియామక పత్రాలను అందజేసి ఒక్కొక్కరి నుంచి రూ. 4 లక్షల చొప్పున వసూలు చేశాడు. వాటిని యువకులు పట్టుకొని ఉద్యోగాల్లో చేరేందుకు వెళ్లగా, అవి నకిలీ నియామక పత్రాలని తెలియడంతో గతేడాది ఫిబ్రవరిలో ఆరుగురు యువకులు గుడిహత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడికి నిర్మల్‌లో జిరాక్స్ సెంటర్ నిర్వహించే సేర్ల నర్సయ్య నకిలీ నియామక పత్రాలను ముద్రించి ఇచ్చి సహకరించాడు. అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నా వీరిద్దరిని ఆదివారం గుడిహత్నూర్‌లో అదుపులోకి తీసుకొని విచారించగా, తమ నేరాన్ని అంగీకరించారు. వీరి నుంచి రూ. 3 లక్షలతోపాటు నకిలీ నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు, కంప్యూటర్, ప్రింటర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని సంప్రదిస్తే వెంటనే పోలీస్‌స్టేషన్ లేదా డయల్ 100కు కాల్చేయాలని చేయాలన్నారు.
ఇచ్చోడ సీఐ రమేశ్‌బాబు, ఎస్ఐ ఎల్ ప్రవీణ్‌ను ఇన్చార్జి ఎస్పీ అభినందించారు. సమావేశంలో శిక్షణ ఎస్ఐ బుద్దే మల్లేశ్, ఏఎస్ఐ రమేశ్, సిబ్బంది ఉన్నారు.