
రాంనగర్లో పోలీసుల కార్డన్ సెర్చ్
120 వాహనాల స్వాధీనం
నిర్మల్ అర్బన్, ఆగస్టు 11 : జిల్లా ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్లో బుధవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయాన్నే కాలనీకి చేరుకున్న పోలీసులు ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 110 బైక్‌లు, 10 ఆటోలు, రూ.2వేల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్డన్ సెర్చ్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, నేరాలు తగ్గుముఖం పడుతాయన్నారు. నేర రహిత జిల్లాగా నిర్మల్‌ను తీర్చిదిద్దుతామన్నారు. నేను సైతం కార్యక్రమం ద్వారా పట్టణ ప్రజలు, వ్యాపారులు, వివిధ కుల సంఘాల నాయకులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాస్, రూరల్ సీఐ వెంకటేశ్, 18 మంది ఎస్ఐలు, 56మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.