
అప్రమత్తమైన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ
సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు
థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్న అధికారులు
మాస్కులు ధరించని వారికి జరిమానా
ఆదిలాబాద్‌లో మున్సిపల్, పోలీసుల తనిఖీలు
ఆదిలాబాద్, జనవరి 11 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :మూడో ముప్పుపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆనుకొని ఉన్న మహారాష్ట్రలో కొవిడ్ కేసులు పెరగడం, వారు రాకపోకలు సాగిస్తుండడంతో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రెండు చొప్పున ఏర్పాటు చేసి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని ఐసొలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్, పోలీసు శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కరోనా థర్డ్ వేవ్‌కు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. రెండు జిల్లాలకు పక్కనే ఉన్న మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నిత్యం వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వ్యాపారాలు, చదువులు, శుభకార్యాలు, ఉపాధి కోసం ప్రజలు రెండు రాష్ర్టాల నుంచి వస్తూపోతుంటారు. ఈ నేపథ్యంలో అధికారులు పక్కరాష్ట్రం నుంచి వచ్చే వారి ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చర్యలు చేపట్టారు. రెండు జిల్లాల్లోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం డొల్లార, బోథ్ మండలం ఘన్పూర్, తలమడుగు మండలం లక్ష్మీపూర్, బేల మండలం కొబ్బయి, నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్తరోడాలో, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల రాపనపల్లిలో చెక్‌పోస్టులు పెట్టారు. వీటిలో వైద్యశాఖ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తారు.
థర్మల్ స్క్రీనింగ్..
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం డొల్లార జాతీయ రహదారి 44తో పాటు ఇతర రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణాలు సాగుతాయి. మిగతా సరిహద్దు గ్రామాల నుంచి రాకపోకలు తక్కువగా ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి చెక్‌పోస్టు వద్ద ఇద్దరు వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తారు. మహారాష్ట్రలో రాత్రి సమయంలో లాక్డౌన్ ఉన్నందున రాకపోకలు లేవు. ఆయా చెక్‌పోస్టుల్లో పక్కరాష్ట్రం నుంచి వచ్చే వారికి వైద్య సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. మహారాష్ట్రకు చెందిన వారికి పాజిటివ్ వస్తే వారిని జిల్లాలో ప్రవేశించకుండా వెనక్కి పంపిస్తారు. మన రాష్ర్టానికి చెందిన వారికి వైరస్ సోకితే ఐసోలేషన్ కేంద్రాలకు పంపించి చికిత్స అందిస్తారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా మాస్కులు తప్పనిసరి ధరించాల్సి ఉన్నా, చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు ధరించని వారికి అధికారులు జరిమానా విధిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం మున్సిపల్, పోలీసు శాఖ అధికారులు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, పలువురికి జరిమానాలు వేశారు. వాహనాలపై తిరుగుతూ మాస్కులు పెట్టుకోని వారిని పోలీసులు గుర్తించి ఫైన్ వేస్తున్నారు.
పకడ్బందీ చర్యలు
జిల్లాలో కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. కొవిడ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు పాజిటివ్ వచ్చిన వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నాం. మహారాష్ట్ర లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాం. ప్రజలు కరోనా నిబంధనలు పాటించి వైరస్ నియంత్రణకు సహకరించాలి.
–నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి, ఆదిలాబాద్