సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్
ఘనంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 10: మానవ హక్కులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి జీ ఉదయ భాస్కర్ అన్నారు. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ప్రతి పౌరునికి హక్కులు కల్పించిందన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశ్‌పాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్లు కిరణ్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మానవ హక్కుల స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్
ఇచ్చోడ, డిసెంబర్ 10 : మానవ హక్కుల స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంబేకర్ పాండురంగ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో మానవ హక్కుల సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సర్వ సైన్యాధికారి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక, 11 మంది సైనికాధికారులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అనంతరం పలువురికి మాస్కులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శివరెడ్డి, మనోజ్, వెంకటేశ్, శంకర్, విజయ్, దాసరి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
విధులు, హక్కులు తెలుసుకోవాలి
ఉట్నూర్, డిసెంబర్ 10: విద్యార్థులు విధులు, హక్కులు తెలుసుకోవాలని ప్రిన్సిపాల్ పావని అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు రాజ్యాంగం, హక్కులు, విధుల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు కేశవులు, మంజుల, శ్రీనివాస్, సువర్ణ, శ్రీలత, వినోద్, గణేశ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ లక్ష్మణ్, సుజాత, దినేశ్‌రెడ్డి, తిరుపతి, సాంబరాజు, నవీన్ పాల్గొన్నారు.