
ఎదులాపురం,డిసెంబర్10: జిల్లాలోని అర్హులైన విద్యార్థులకు వంద శాతం ఉపకారవేతనాలు వెంటనే అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రీ మెట్రిక్, కొత్త పథకం, రాజీవ్ విద్యా దీవెన పథకం అమలుపై జిల్లా ఎస్సీ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో వివిధ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ ఉపకారవేతనాలు మంజూరు కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. ఇందుకు కావాల్సిన అన్ని ధ్రువీకరణ పత్రాలను సమకూర్చాలని సంబంధిత రెవెన్యూ బ్యాంక్ అధికారులను కోరారు. ఉపకారవేతనాలను వందశాతం అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలకు మిషన్ భగీరథ నీరు అందించాలని మిషన్ భగీరథ అధికారికి, బస్సు సౌకర్యం కల్పించేలా చూడాలని ఆర్టీసీ అధికారికి సూచించారు. సమావేశంలో డీఎస్సీడీవో భగత్ సునీత, డీఈవో ప్రణీత, డీఆర్డీఏ కిషన్, ఆర్టీసీ మేనేజర్, డీఎస్డబ్ల్యూఐడీసీ ఈఈ, మిషన్ భగీరథ అధికారి, ఎంఈవోలు, ఎస్సీ వసతిగృహ అధికారి నారాయణరెడ్డి, ఏఎస్డబ్ల్యువో జీ పూర్ణచందర్రావు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.