
నేల స్వభావం, అధిక వర్షపాతమే కారణం
పింజ పొడువు, గట్టిగా ఉండడం ప్రత్యేకత
దూది తెల్లగా..ఆకట్టుకునేలా..
తరతరాలుగా సాగవుతున్న పంట
గింజతో నూనె, పశువుల దాణా తయారీ
వరితో పోలిస్తే పత్తి సులభం, లాభదాయకం
ఆదిలాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ పత్తి ఖండాంతర ఖ్యాతిగాంచింది. మన జిల్లాలో పండించిన తెల్లబంగారం ఆసియాతోపాటు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నది. ప్రధానంగా నల్లరేగడి నేలలు అధికంగా ఉండడం, వాతావరణం అనుకూలించడం, అధిక వర్షపాతం నమోదవడం వంటి వాటితో పత్తి నాణ్యతగా ఉంటోంది. దీనికితోడు పింజ గట్టిగా, పొడువుగా ఉండడం.. దూది తెల్లగా ఉండి, దారం కూడా బాగుండడంతో మంచి డిమాండ్ ఉంది. రైతులకు కూడా మంచి ధర రావడంతో తరతరాలుగా పత్తినే సాగు చేస్తున్నారు. పంట విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో 5.72 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా.. 85 శాతం నల్లరేగడి నేలలు ఉన్నాయి. ఈ భూములు పత్తికి అనుకూలంగా ఉండి.. నీటిని అధికంగా నిల్వ చేసుకునే స్వభావం కలిగి ఉండడంతో 20 రోజుల వరకూ వర్షం కురవక పోయినా పంట ఎండిపోదు. మామూలు వర్షం కురిసినా పంట ఏపుగా పెరుగుతుంది. జిల్లాలో యేటా 1,200 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదవుతుండగా.. ఈ యేడాది ఇప్పటివరకు సాధారణం కంటే అధికంగానే వాన పడింది. కాగా.. విత్తనాల తయారీ కంపెనీల మధ్య పోటీ పెరగడంతో కొత్త వంగడాలు వస్తున్నాయి. రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో ఏఈవో, శాస్త్రవేత్తల సూచనలు పరిగణనలోకి తీసుకుంటున్నారు. కాయబరువు ఎక్కువ ఉన్నవి, గత సాగు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విత్తనాలు ఎంపిక చేస్తున్నారు. జూన్ మొదటి, రెండు వారాల్లో విత్తనాలు వేస్తారు. గతంలో నాన్బీటీ విత్తనాలను 4X4 అడుగుల దూరంలో వేసేవారు. ప్రస్తుతం బీటీ విత్తనాలను 3X3 అడుగుల దూరంలో విత్తుతున్నారు.
వరి కంటే మేలు..
వరితో పోల్చితే పత్తి లాభసాటిగా ఉంటుంది. నీటి సౌకర్యం ఉన్న రైతులు ఐదెకరాల్ల్లో వరి వేస్తే ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున 125 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ యేడాది ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.1,960 కాగా.. రూ.2.45 లక్షల ఆదాయం సమకూరుతుంది. ఐదెకరాల్లో పత్తి వేస్తే ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున 50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం పత్తి ధర క్వింటాలుకు రూ.6,025 ప్రకటించగా.. ఇందుకు రూ.3 లక్షలు వస్తాయి. ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరతో కొనుగోలు చేస్తారు. దీంతో మద్దతు ధర కంటే అధిక లాభం వస్తుంది. పత్తిలో అంతర పంటగా కందిని వేస్తారు. ఆరు, ఎనిమిది సాళ్లకు ఒక సాలు వేస్తారు. కంది ఎకరాకు 3 క్వింటాళ్ల చొప్పున 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ ధర క్వింటాలుకు రూ.6,300 ఉండగా రూ.31,500 ఆదాయం వస్తుంది. వరితో పోల్చితే పత్తి సాగు సులభదాయకం. వరికి ఎప్పుడూ తడి ఉండాలి. పత్తికి 20 రోజుల వరకు వర్షం పడకపోయినా ఇబ్బంది ఉండదు. వర్షాధారంపై రైతులు ఈ పంటను వేసుకోవచ్చు. పత్తి వేస్తే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఎకరాకు రూ.36 వేల వరకు రుణం లభిస్తుంది. పత్తిలో అంతర పంటను సాగు చేయడంతో మిత్ర పురుగుల సంఖ్య పెరగడమే కాకుండా వాతావరణ ఒడిదొడుకుల నుంచి రక్షణ కలుగుతుంది.
ఆసియాలోనే నాణ్యమైన పంట..
ఆదిలాబాద్ జిల్లాలో పండే పత్తికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. నేల స్వభావం, అనుకూలమైన వాతావరణం, అధిక వర్షపాతం వంటి కారణాలతో ఆసియా ఖండంలోనే నాణ్యమైనదిగా పేరుంది. పింజ పొడువుగా ఉండడం, దారం గట్టిగా, పొడువుగా రావడం వంటివి వీటి ప్రత్యేకత. ఇంకా.. దూది తెల్లగా ఉండి ఆకట్టుకునేలా ఉంటుంది. ఫలితంగా వ్యాపారులు ఆదిలాబాద్ పత్తిని కొనడానికి మొగ్గు చూపుతారు. సీసీఐతోపాటు ప్రైవేట్ వ్యాపారులు పత్తి బేళ్ల(గటాన్)ను తయారు చేస్తారు. ప్రైవేట్ వ్యాపారులు తమ సొంత జిన్నింగ్తోపాటు, సీసీఐ అధికారులు లీజుకు తీసుకున్న జిన్నింగ్లో పత్తిని బేళ్లుగా మారుస్తారు. ఐదు క్వింటాళ్ల పత్తిని జిన్నింగ్ చేస్తే ఒక బేలు తయారవుతుంది. 165 కిలోలు ఉండే బేల్ అంతర్జాతీయ మార్కెట్లో రూ.55 వేల వరకు ధర పలుకుతుంది. జిల్లాలోని పత్తి బేళ్లను వ్యాపారులు, సీసీఐ అధికారులు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు.
గింజలతో బహుళ ప్రయోజనాలు..
క్వింటాలు పత్తిలో 33 శాతం దూది, 64 శాతం గింజ, 2 శాతం వేస్టేజ్ కింద పోతుంది. గింజలతో నూనె, పశువుల దాణా తయారవుతుంది. క్వింటాలుకు 8 కిలోల నూనె లభిస్తుంది. ప్రస్తుతం గింజ క్వింటాలు ధర రూ.3,500. జిన్నింగ్ మిల్లుల్లో గింజల నుంచి నూనెను తయారు చేస్తారు. సీడ్ కంపెనీల యజమానులు పత్తి గింజలను కొనుగోలు చేసి రసాయనాలు కలిపి తిరిగి విత్తనాలుగా విక్రయిస్తారు.
తాతల కాలం నుంచి పత్తి వేస్తున్నాం..
నాకు ఆరెకరాల భూమి ఉంది. మా తాతల కాలం నుంచి పత్తి సాగు చేస్తున్నా. పంట పెట్టుబడి తక్కువగా ఉండడంతోపాటు యేటా ధర పెరుగుతుంది. సీసీఐతోపాటు ప్రైవేట్ వ్యాపారులు పత్తిని కొనుగోలు చేస్తారు. నాకున్న ఆరెకరాల్లో పత్తి వేశా. అంతర పంటగా కంది సాగు చేస్తున్నా. ఎకరాకు 9 నుంచి 10 క్వింటాళ్ల పత్తి, 3 క్వింటాళ్ల కందులు వచ్చే అవకాశాలున్నాయి.