
రైతుబీమాపై అవగాహన కల్పించాలి
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
నిర్మల్ టౌన్, ఆగస్టు 10 : వానకాలంలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఆన్లైన్లో పక్కాగా నమోదు చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అధికారులతో మంగళవారం సమావేశమై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ. 50వేల రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో అర్హుల జాబితాను గుర్తించి నివేదిక అందించాలని సూచించారు. రైతుబీమా పథకంపై రైతులకు అవగాహన కల్పించి, ఈనెల 12లోపు అర్హులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో సాగు విస్తీర్ణం ఆధారంగా పంటల నమోదును సక్రమంగా నిర్వహిస్తేనే కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, ఏడీఏ వినయ్‌బాబు పాల్గొన్నారు.
ప్రకృతివనాలతో ఆహ్లాదం..ఆరోగ్యం
సోన్, ఆగస్టు 10: ప్రకృతివనాలు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. సోన్ మండలం పాక్పట్ల, పాత పోచంపాడ్‌లో ప్రకృతివనాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని జిల్లా అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. బృహత్ పల్లె ప్రకృతవనం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతివనాలకు ప్రత్యేక నిధులు విడుదల చేస్తున్నదన్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంతంలో బృహత్ పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి నీటి నిల్వ సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, సర్పంచ్‌లు ఎల్చల్ గంగారెడ్డి, మమత, ఎంపీవో అశోక్, తహసీల్దార్ ఆరిఫా సుల్తానా తదితరులున్నారు.