నిర్మల్ అర్బన్, మార్చి 17 ః నిర్మల్ జిల్లావ్యాప్తంగా నేటి (సోమవారం) నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. 8,923 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానుండగా.. ఇందులో 4,309 మంది బాలురు.. 4,614 మంది బాలికలు ఉన్నారు. ఇందుకోసం 47 కేంద్రాలను సిద్ధం చేశారు. 47 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 47 మంది డిపార్ట్మెంట్ అధికారులు, ఏడుగురు కస్టోడియన్లు, 500 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ను ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ జరుగకుండా ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఫ్లయింగ్, సిట్టింగ్ స్కాడ్, ప్రత్యేక బృందాలు కేంద్రాలను పర్యవేక్షించనున్నాయి. కేంద్రాల్లో విద్యుత్, ఫ్యాన్లు, తాగునీరు, మరుగుదొడ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఏఎన్ఎంను అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చిన ప్రశ్నాపత్రాలను ఓపెన్ చేసినప్పటి నుంచి తిరిగి జవాబు పత్రాలను ప్యాక్ చేసే వరకు రికార్డు చేయనున్నారు. ఈ డేటాను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు అందించనున్నారు. ఫలితంగా అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉంటుంది. నిమిషం నిబంధనను తొలగించారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని నిర్మల్ డీఈవో రవీందర్రెడ్డి తెలిపారు.
ఆదిలాబాద్లో ఏర్పాట్లు పూర్తి
ఆదిలాబాద్ రూరల్, మార్చి 17 ః పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో ప్రణీత తెలిపారు. పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని, గంట ముందే వస్తే ప్రశాంతంగా పరీక్ష రాసుకునే వీలుంటుందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 10,507 మంది పరీక్ష రాస్తుండగా. ఇందులో బాలురు 5,252.. బాలికలు 5,255 మంది ఉన్నారని తెలిపారు. 53 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
కేంద్రాల పరిశీలన
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆదివారం డీఈవో ప్రణీత పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు చేశారు. కేంద్రాల వద్ద ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటారని, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.