మణుగూరు రూరల్, అక్టోబర్ 9: టీబీజీకేఎస్‌పై జాతీయ సంఘాలు చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలని టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వూకంటి ప్రభాకర్‌రావు అన్నారు. కేసీహెచ్‌పీలో శనివారం జరిగిన పిట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల నుంచి టీబీజీకేఎస్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఏఐటీయూసీ మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారన్నారు. కరోనా కాలంలోనూ అమితమైన ప్రేమ, గౌరవంతో లాభాల్లో వాటా 29 శాతాన్ని చెల్లించాలని ఆదేశాలిచ్చిన సీఎం కేసీఆర్‌ను కార్మికులు ఏ నాటికీ మరిచిపోలేరన్నారు. జాతీయ సంఘాలు కావాలనే లాభాల వాటా ప్రకటింపుపై విష ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. సింగరేణిలో వచ్చిన లాభాలు, నష్టాలపై రాష్ట్రప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని కాగ్ సంస్థ కూడా ఆడిట్ చేసిన అనంతరం వాస్తవ లాభాల ప్రకటింపు చేస్తారని తెలియకపోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు గుర్తింపు సంఘాలుగా ఉన్నప్పుడు చెల్లించిన వాటా కంటే 2012-2013 నుంచి గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్ ఎన్నికైన నాటి నుంచి ఎక్కువ శాతం సాధిస్తుందన్నారు. నిస్వార్థంగా సేవలందిస్తూ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న టీబీజీకేఎస్‌ను విమర్శిస్తే కార్మిక క్షేత్రంలో తగిన గుణపాఠం చెబుతామన్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య నేతృత్వంలో ఇప్పటికే 60కి పైగా హక్కులు సాధించి చరిత్ర సృష్టించామన్నారు. సమావేశంలో నాయకులు అబ్దుల్ రవూఫ్, కోట శ్రీనివాసరావు, వెంకటేశ్వరరెడ్డి, కాపా శివాజీ, రామారావు, వెంకట్రావు, బాలాజీ, ముత్యం, శ్రీనివాస్, శంకర్, గాలిబ్ పాషా, అశోక్ తదితరులున్నారు.