ఆమోదముద్ర వేసిన మంచిర్యాల బల్దియా కౌన్సిల్
తడి-పొడి చెత్తతో కంపోస్ట్, టైల్స్ తయారు
రూ.1.30 కోట్లతో సెగ్రిగేషన్ ప్లాంట్ ఏర్పాటునకు సన్నాహాలు
మున్సిపాలిటీకి సమకూరనున్న ఆదాయం
నెల రోజుల్లో ప్రారంభిస్తాం.. : మున్సిపల్ చైర్మన్ రాజయ్య
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 9 :చెత్తకు కొత్త అర్థం చెబుతూ మంచిర్యాల బల్దియా కీలక నిర్ణయం తీసుకున్నది. తడి-పొడి చెత్తను ఆదాయ వనరుగా మార్చడానికి ప్రణాళికలు రూపొం దించింది. ఈ మేరకు రూ.1.30 కోట్లతో పట్టణంలో సాలిడ్‌వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ నిర్మించడానికి కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. తడి చెత్తతో కంపోస్ట్ ఎరువు, పొడి చెత్తతో టైల్స్ తయారు చేయాలని భావిస్తున్నది. నెల రోజుల్లో సెగ్రిగేషన్ ప్లాంట్ పనులు ప్రారంభం కానుండగా.. టెండర్ల ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి చేయనున్నట్లు మున్సిపల్ పాలకవర్గం తెలిపింది.
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆగస్టు నెలాఖరులో ప్లాంట్ నిర్మాణం చేసేందుకు కౌన్సిల్ ఆమోదముద్ర కూడా వేసింది. ఇప్పటికే మున్సిపాలిటీ సిబ్బంది ప్రతి ఇంటికి తడి-పొడి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. కానీ.. తడి-పొడి చెత్తను ప్రజలు వేరు చేసి ఇవ్వడం లేదు. దీంతో ఆండాళమ్మకాలనీలోని డంప్‌యార్డులో గల డీఆర్సీలో చెత్తను వేరు చేస్తున్నారు. ఇందుకు అధిక మానవ వినియోగం, ఆశించినస్థాయిలో పని జరుగడం లేదు. ఇందుకోసం రూ.1.30 కోట్లతో సెగ్రిగేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి తక్కువ స్థలం అవసరం ఉండడం, మ్యాన్‌పవర్ కూడా అధికంగా అవసరం లేకపోవడంతో ప్లాంట్ ఏర్పాటునకు మొగ్గు చూపుతున్నారు. మిషనరీ ద్వారానే తడి-పొడి చెత్తను వేరు చేసి.. ప్రాసెసింగ్ ద్వారా తడిచెత్తతో కంపోస్ట్, పొడి చెత్తతో టైల్స్ తయారీ చేసి ఆదాయం పొందవచ్చని మున్సిపాలిటీ అధికారులు భావిస్తున్నారు.
కంపోస్ట్, టైల్స్ తయారు ఇలా..
ఇండ్లలో సేకరించిన తడి-పొడి చెత్త మిశ్రమాన్ని సెగ్రిగేషన్ ప్లాంటులో వేస్తారు. ఇందులోని కన్వేయర్ బెల్ట్ ద్వారా తడి, పొడి చెత్తను వేరు చేస్తారు. తేలికగా ఉన్న చెత్త ముందుగా ఒక కంపార్ట్మెంట్లోకి, బరువుగా ఉన్న చెత్త మరో కంపార్ట్మెంట్లోకి తరలిస్తారు. పొడి చెత్త కింద పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, అట్టముక్కలు, పేపర్ వేస్ట్.. తడిరకానికి చెందిన వాటిలో ఆహార పదార్థాలు, కూరగాయలు, సీసం బా టిళ్లు, కొబ్బరి బోండాలు ఉంటాయి. వేరు చేసిన తడి పదార్థాలను పల్వరైజర్ మిషన్ (ఫట్కామిషన్)లో వేసి దానికి ముక్కలుగా తయారు చేస్తా రు. అలా తయారు చేసిన చెత్తను విండ్రో కంపోస్ట్(గాలికి ఆరబెట్టడం) చేస్తారు. ఇలా ఆరబెట్టిన చెత్తను కంపోస్ట్ షెడ్లలో వేసి అందులో వానపాములను వేసి కంపోస్ట్‌గా తయారు చేస్తారు. తయారైన కంపోస్ట్‌ను ప్రస్తుతం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడిచే హరితహారం నర్సరీల్లో మొ క్కలకు ఎరువుగా వాడుతారు. ఇక పొడి చెత్తను ఫట్కామిషన్లో వేసి ముక్కలుగా చేస్తారు. అనంతరం బెయిలింగ్ మిషన్‌లో వేసి ప్రెస్సింగ్ చేస్తారు. అనంతరం ప్లాస్టిక్ ముక్కలను అగాగ్లో మిషన్‌లో వేసి గ్రైండింగ్ చేస్తారు. అక్కడ నుంచి ఎక్స్‌ట్రూడర్ యంత్రంలోకి పంపి మెల్టింగ్ చేసి ఆ ద్రావణంతో ప్లాస్టిక్ టైల్స్‌ను తయారు చేస్తారు.
నెల రోజుల్లో ప్రారంభిస్తాం..
మంచిర్యాలలో ఏర్పాటు కానున్న సెగ్రిగేషన్ ప్లాంటుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. చెత్తను వృథాగా పోనీయకుండా అవసరమైన ఎరువు లు, నిర్మాణ రంగంలో ఉపయోగించే సామగ్రిని తయారు చేసుకోబోతున్నాం. ఇదో రకంగా మున్సిపాలిటీకి ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంటుంది. తక్కువ స్థలంలో ఎక్కువ చెత్తను వేరు చేసి మన అవసరాలకు వాడుకున్నవారమవుతాం. ఈ ప్లాంటును త్వరలోనే మంచిర్యాలలో ఏర్పాటు చేయబోతున్నాం. టెండర్ ప్రక్రియ పూర్తవ్వగానే ప్లాంటును ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నాం. మరో నెల రోజుల్లో ప్రారంభిస్తాం.
-పెంట రాజయ్య, మున్సిపల్ చైర్మన్, మంచిర్యాల