నిర్మల్ జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి ఆయా పంటల సాగుకు అవసరమైన నీరందించేలా జిల్లా నీటి పారుదల శాఖ సిద్ధంగా ఉంది. ఏటా ఈ సమయంలో రైతాంగం ఆరుతడి పంటల సాగుకే మొగ్గు చూపుతున్నది. అయితే ఈ సారి భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకోగా, 1,73,650 ఎకరాల్లో ఆయా పంటలకు సకాలంలో నీరందించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. అత్యధికంగా కడెం ప్రాజెక్టు కింద 65 వేల ఎకరాలతో పాటు 734 చెరువుల ద్వారా పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందనున్నది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో ఏటా కంటే పంటల సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశమున్నది.
– నిర్మల్, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ)
నిర్మల్, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ): ఈ యాసంగి సీజన్లో ఆయా పంటల సాగుకు అవసరమైన నీరందించేలా జిల్లా నీటి పారుదల శాఖ సర్వం సిద్ధం చేసింది. జిల్లా రైతులు ఏటా యాసంగిలో ఆరుతడి పంటల సాగుకే మొగ్గు చూపుతారు. అయితే ఈ సారి భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరి జలకళతో నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో అన్ని రకాల పంటలకు నీరందే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన చెరువులను గత కేసీఆర్ ప్రభుత్వం బాగు చేయించింది.
మిషన్ కాకతీయ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న 734 చెరువులకు మరమ్మత్తులు చేసి పూర్వ వైభవం తీసుకొచ్చింది. గత నాలుగేళ్లుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులతో పాటు చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టులు, చెరువుల కింద ఆయకట్టుకు అన్ని రకాల పంటలను వేసేందుకు అనువుగా సాగునీటిని అందించనుండడంతో గతంకంటే ఈ యాసంగిలో పంటల సాగు రెట్టింపు కానుంది. మరోవైపు ప్రాజెక్టులు, ప్రధాన చెరువుల కింద ఉన్న కాలువల మరమ్మతులను ఇప్పటికే పూర్తి చేశారు.
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చాలా చోట్ల చెరువులకు గండ్లు పడడం, కాలువలు దెబ్బ తినడం జరిగింది. వీటి మరమ్మత్తుల కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. కోటీ 47లక్షల నిధులను మంజూరు చేసింది. మొత్తం 197 చోట్ల దెబ్బతిన్నట్లు గుర్తించిన అధికారులు 61 పనులను అత్యవసరంగా చేపట్టి వానకాలం పంటలకు సాగునీరందేలా చేశారు. అలాగే సారంగాపూర్ మండలంలో రూ.9 కోట్లు వెచ్చించి ధోనిగాం ప్రాజెక్టు కాలువల పనులను దాదాపుగా పూర్తి చేశారు. దీంతో ఈ ప్రాజెక్టుకింద అదనంగా మరో 2 వేల ఎకరాలకు సాగునీరందనుంది. దీంతో ఈ యాసంగి పంటలకు ఢోకా లేకుండా పోయింది.
ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో సాగునీరందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలోని కడెం నారాయణరెడ్డి, స్వర్ణ, గడ్డెన్నవాగు, సదర్మాట్ ప్రాజెక్టులతో పాటు ఎస్సారెస్పీ సరస్వతీ కాలువ ద్వారా జిల్లా రైతాంగానికి సాగు నీరందనున్నది. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 734 చెరువుల కింద గల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరందనున్నది. ఆయా ప్రాజెక్టులు, చెరువుల కింద గల 1,73,650 ఎకరాల ఆయకట్టుకు అన్ని పంటలకూ సరిపడా సాగునీరందించాలని అధికారులు భావిస్తున్నారు.
అత్యధికంగా కడెం ప్రాజెక్టు కింద 65వేల ఆయకట్టుకు నీరందనున్నది. అలాగే గడ్డెన్న వాగు ప్రాజెక్టు కింద 12 వేలు, స్వర్ణ ప్రాజెక్టు కింద 8,945 ఎకరాలు, సదర్మాట్ కింద 13,120 ఎకరాలు, ఎస్సారెస్పీ పరిధిలోని సరస్వతీ కాలువ కింద 35,375 ఎకరాలు సాగుకు నోచుకోనున్నాయి. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 734 చెరువుల కింద 71, 832 ఎకరాల ఆయకట్టుకు యాసంగిలో సాగు నీరందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాజెక్టులు, చెరువుల్లో పుష్కలంగా నీరుంది. ఆయా ప్రాజెక్టులు, చెరువుల కింద గల కాలువలకు అవసరమైన చోట మరమ్మతులు కూడా పూర్తి చేశాం. సదర్మాట్ ఆనకట్ట వద్ద అక్విడక్టుకు మరమ్మతులు కూడా పూర్తయ్యాయి. అక్కడక్కడ కాలువల మరమ్మతులు కొనసాగుతున్నాయి. త్వరలోనే వాటిని కూడా పూర్తి చేసి, జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,73,650 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందేలా చర్యలు తీసుకుంటాం.
-సుశీల్‌కుమార్, ఎస్ఈ, నీటిపారుదల శాఖ, నిర్మల్