మంచిర్యాల, నవంబర్ 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో కరెంటుకు కటకట. ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెలిసేది కాదు. అరకొరగా విద్యుత్ ఇవ్వడంతో నీరు రాక, మడి పారేది కాదు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే వారు. పొలంలోనే విద్యుత్ షాక్ తగిలి చనిపోయిన సందర్భాలు కోకొల్లలు. రాత్రిళ్లు మోటర్ పెట్టడానికి పోతే విష పురుగులు కాటేసి చనిపోయిన వారు. నెర్రలు వారిన నేలలను చూసి పురుగుల మందు తాగి, చెట్టుకు ఉరేసుకొని చనిపోయిన సందర్భాలు లెక్కలు మిక్కిలి. ఇటువంటి వాటిని చూసి చలించిన కేసీఆర్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు. 2018 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా.. దాదాపు ఐదేండ్ల 11 నెలలుగా ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఫలితంగా సాగు పెరిగింది. దీనికి అనుగుణంగా దిగుబడి కూడా మూడింతలైంది. ప్రతి ఇల్లూ ధాన్యంతో సిరి, సంపదలతో కళకళలాడుతున్నది. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రెండు, మూడెకరాలు ఉన్న అన్నదాత కోటీశ్వరుడైండు. ఈ సందర్భంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటుపై కథనం..
ఏ అర్ధ రాత్రో.. అప రాత్రో.. దొంగోనోలే వచ్చే కరెంట్ కోసం పొలాల దగ్గర పడిగాపులు. కరెంట్ వచ్చే టైమ్ తెలుసుకొని అర్ధ రాత్రి మోటర్ పెట్టేందుకు పోతే.. కాళ్లకు కరెంట్ తీగలు తగిలో.. పాముల, తేల్లు కరిచో రైతుల ప్రాణాలు పోయేవి. ఇది 50 ఏండ్లు మన రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పాలనలో దుస్థితి. తెలంగాణ వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు. పదేళ్ల పాలనలో కరెంట్ షాక్‌లు కొట్టి రైతులు చనిపోయిన దాఖలాలు, కరెంట్ కోసం పొలాల కాడ పడిగాపులు కాయాల్సిన అక్కర లేకుండా పోయింది. రైతుకు ఎప్పుడు కుదిరితే అప్పుడే మోటర్ వేసుకుంటే పొలాలకు నీళ్లు పారుతున్నయ్. గింత మంచి విద్యుత్ సరఫరాను ఆపేసి, మూడు గంటలు కరెంట్ ఇస్తే సరిపోతదని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడడంపై రైతులు మండిపడుతున్నారు. ఎప్పుడన్న ఎవుసం చేసినోళ్లయితే ఎన్ని గంటల కరెంట్ ఇవ్వాలనేది తెలిసేదని.. రైతుల కష్టం తెలియకుండా మూడు గంటల కరెంట్ సాలుతదని చెప్పినోళ్లు రేపు పొరపాటునో, గ్రహపాటునో గెలిస్తే పాత రోజులు మళ్లొస్తయని భయపడిపోతున్నరు. ఉచిత విద్యుత్ ఇచ్చిన కేసీఆరే రానున్న రోజుల్లో దాన్ని కొనసాగిస్తారని.. ముచ్చటగా మూడోసారి ఆయన్నే గెలిపించుకుంటామని చెప్తున్నరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,43,217 ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. ఆసిఫాబాద్‌లో 6,800.. మంచిర్యాలలో 45,793.. నిర్మల్‌లో 72 వేలు, ఆదిలాబాద్‌లో18,624 కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా లక్షలాది మంది రైతుల పొలాలకు నీళ్లు పారుతున్నయ్. కరెంట్ బిల్లులు కట్టే అవసరం లేకుండా, మోటార్లు కాలిపోయే దుస్థితి లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్నది. ఈ నేపథ్యంలో 24 గంట ల ఉచిత విద్యుత్‌పై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
కరెంటు కోసం 13 ఏండ్లు గోస పడినం..; దూపం కుమార్ యాదవ్
నా పేరు దూపం కుమార్. మాకు నెన్నెలలో ఐదేకరాల భూమి ఉంది. 13 ఏండ్ల కిందట వరి పండిద్దామని చేనును చదును చేసి పొలం చేసినం. మొదట వర్షాధారంగా సాగు చేద్దామని అనుకొని మొదలు పెట్టినం. వర్షాలు అనుకున్నంత పడక పంట చేతికచ్చేది కాదు. ఇలాగే ఉంటే కష్టమని అప్పు తెచ్చి బోరు వేయించినం. కరెంటు కోసం దరఖాస్తు చేసుకున్నం. దరఖాస్తు చేయడానికే నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినం. దరఖాస్తు చేసిన ఆరు నెలలకు కరెంటు లైన్ వచ్చింది. అప్పుడు సంతోష పడ్డాం. ఇక రెండు పంటలు పండుతాయనుకొని సంబుర పడ్డా.. మాకు చేదు అనుభవమే ఎదురయ్యింది. మొదటి ఏడాది వానకాలం పంట వేసినం. అప్పుడు అడపాదడపా వర్షాలు పడ్డాయి. వరి పొట్ట దశకు చేరుకొనే సమయానికి వానలు లేకుండా పోయినయ్. ఇక కరెంటే దిక్కే అనుకొని సాగు నీరు అందిద్దామని పొలం బోరుకాడికి పోతే కరెంటు వచ్చేది లేకపోయే. పొద్దంతా బోరుకాడ ఎదురు చూసి చూసి కండ్లు మూతలు పడేవి. సద్ది కట్టుకొని అక్కడే ఉండేవాళ్లం. రాత్రి ఎప్పుడో కరెంటు వచ్చేది. కరెంటు వచ్చినంక బోర్ వేస్తే రెండు మూడు గంటలు మాత్రమే పోసేది. ఆ వచ్చే నీరుతో ఒక్క మడి కూడా తడవక పోయేది. అలా రోజు రాత్రి పొలం కాడనే మంచే వేసుకుని ఉండేటోన్ని. వారం రోజులైన ఉన్న పొలం తడవక పోయేది. చివరి మడి వరకు నీరు వచ్చే సరికి పంట ఎండిపోయేది. ఒక్కొక్క సారి పాములు, తేళ్లు దాటుకుంటూ పోయేటోన్ని.
అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏనాడు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. పంటలు ఎండుతున్న కరెంటు ఇయ్యలేదు. ఒక్క పంట కోసం ఎన్నో ఇబ్బందులు పడినం. రాత్రి వేళ కరెంట్ కోసం లైట్లు పట్టుకుని పోయే లైన్ వెంట తిరిగినం. పగలు ఏనాడు కరెంటు ఇయ్యలేదు. పగలు కొంచేం రాత్రి కొంచెం ఇచ్చినా రైతులకు కొంత ఇబ్బంది ఉండేది కాదు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. దాదాపు పదమూడేండ్లు కరెంటు కోసం నానావస్థలు పడ్డాం. రెండు పంటలు వేద్దామనుకున్న మాకు చేదు అనుభవమే ఎదురయ్యింది. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు న్యాయం జరిగింది. ఇప్పుడు మాకు రెండు పంటలు ఫుల్లుగా పండుతున్నయ్. మొదట తొమ్మిది గంటలు రైతులకు ఉచితంగా ప్రభుత్వం నాణ్యమైన కరెంట్ ఇచ్చింది. ఆ తర్వాత 24 గంటలపాటు ఉచితంగా కరెంట్ ఇస్తుండడంతో మాకు ఢోకా లేకుండా పోయింది. ఒక్కసారీ మోటర్ స్టార్ట్ చేసి వస్తే సాయంత్రం వరకు పొలం కాడికి పోయేటోళ్లం కాదు. ఒక్క మడిలో నీళ్లు స్టార్ట్ చేస్తే చివరి మడి వరకు 24 గంటల కరెంటుతో నిండి పోతుంది. రెండు పంటలు అనుకున్నంత పండుతున్నయ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదెకరాలకు నీళ్లు రావని రెండు ఎకరాల సాగు చేస్తే సాగు నీరు అందడానికి వారం-పది రోజులు పట్టేది. ఇప్పుడు మాత్రం మాకున్న ఐదెకరాలకు రెండున్నర రోజులు పడుతుంది. అనుకోకుండా మెయిన్ లైన్లో ప్రధాన సబ్ స్టేషన్లలో లోపాలు వస్తే తప్పా కరెంటు పోవడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందించి న్యాయం చేస్తున్నరు. ఇలాంటి ప్రభుత్వం మరోసారి వస్తేనే రైతులకు ఏ గోస ఉండదు.
రెండు పంటలకూ సాగునీరు
నాకు ఐదెకరాల భూమి ఉన్నది. నేను వానకాలంలో పత్తి, సోయాబీన్, శనగ పంటలను పండిస్తాను. ఇంతకు ముందు కరెంటు సరిగా లేక ఒక్క పంట కూడా సరిగ్గా చేతికి వచ్చేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే రెండు, మూడు గంటల కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. ఇగ రాత్రింబవళ్లు బావుల వద్దే ఉండేది. వానకాలంలో వర్షాలపై ఆధారపడి పంటలు సాగుచేసేటోళ్లం. వానలు పడకుంటే పెట్టుబడులు కూడా వెళ్లకపోయేటివి. చేసిన అప్పులు తీరక, ఇబ్బందులు పడేవాళ్లం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల కరెంటు కష్టాలు దూరమయ్యాయి. ఇప్పుడు 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా అవుతున్నది. నేను ఐదెకరాల్లో రెండు పంటలు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది వానకాలంలో రెండెకరాల్లో పత్తి, మూడెకరాల్లో సోయా పంటను వేశాను. సోయాకు తుది దశ ఉండగా వర్షాలు లేకపోవడంతో మోటర్ ద్వారా నీటిని అందించాను. పత్తి పంటకు కూడా నీటిని ఇస్తున్నాను. దీంతో పంట దిగుబడులు బాగు వస్తున్నాయి. యాసంగిలో మూడెకరాల్లో శనగ పంటను వేశాను. ఈ పంటకు అవసరమైనప్పుడు నీటిని ఇస్తున్నాను. రైతులకు 24 గంటల కరెంటు సౌకర్యం ఎంతో మేలు చేసింది.
– గైక్వాడ్ మారుతి, ముక్రా(కే), ఇచ్చోడ మండలం ఆదిలాబాద్
24 గంటల కరెంట్‌తో తీరిన ఇబ్బందులు
కడెం, నవంబర్ 13: నాపేరు ఆవుల సతీశ్. మాది కడెం మండలం కన్నాపూర్ గ్రామం. నాకు పదెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. గతంలో ఎవుసం చేయడానికి కరెంట్ కోతలతో ఎన్నో ఇబ్బందులు పడ్డా. కానీ ఇప్పుడా ఇబ్బంది లేదు. 24 గంటల కరెంట్‌ను ఇస్తున్నరు. ఇందుకే ఇప్పుడు వ్యవసాయం పండుగైంది. రైతుల గోసను అర్థం చేసుకున్నది సీఎం కేసీఆర్ ఒక్కరే. సమైక్య పాలనలో కరెంట్ లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డరు. గతంలో 6 గంటలకు మించి కరెంట్ ఉండేది కాదు. ఇగ రైతుల పంటకు నీరు పారించుకునేందుకు పొలాల కాడ్నే కాపాలా కాయల్సి వచ్చేది. ఇగ నాణ్యమైన కరంట్ ఇయ్యకపోవడంతో, విద్యుత్ మోటర్లు కాలి నష్టం కూడా జరిగేది. నెలకు రూ. నాలుగైదు వేలు రిపేర్ల ఖర్చయ్యేది. రాత్రి పూటనే త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేయడంతో అర్ధరాత్రి టార్చ్లైట్లు పట్టుకొని మోటర్ల దగ్గరకు వెళ్తే, కరెంట్ షాక్‌తో ఎందరో రైతులు చనిపోయిన్రు. నాడు వ్యవసాయం చేసుడంటనే భయపడే రోజులు వచ్చినయ్. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అని సీఎం కేసీఆర్ రైతులకు సహకరిస్తున్నడు. కరెంట్ కోతలు లేకుండా సబ్స్టేషన్లు మంజూరు చేయించిండు. ట్రాన్స్ఫార్మర్లు, అదనంగా విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు చేపట్టి, నాటి ఇబ్బందులను అధిగమించిండు. అన్ని ఇబ్బందుల నుంచి సీఎం కేసీఆర్ రైతులను బయటపడేసిండు. రాష్ర్టానికి న్యాయం జరుగుతదంటే అది సీఎం కేసీఆర్ ఒక్కరితోనే సాధ్యమైతది. -ఆవుల సతీశ్, రైతు, కన్నాపూర్