
ఈ నెల 1న ప్రారంభించిన డీఎస్పీ హర్షవర్ధన్
మూడు నెలల పాటు శిబిరం
పాల్గొంటున్న 150 మంది
ఇంద్రవెల్లి, డిసెంబర్ 8 : ఇంద్రవెల్లి ఎస్ఐ నందిగామ్ నాగ్నాథ్ గ్రామీణ యువతకు ఉచితంగా ఆర్మీలో ఎంపికకు శిక్షణ ఇప్పిస్తూ వారి భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. హీరాపూర్ గ్రామ సమీపంలోని అమరవీరుల స్తూపం పక్కనున్న వ్యవసాయ భూమిలో గ్రౌండ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 1న డీఎస్పీ హర్షవర్ధన్ శిక్షణ ప్రారంభించారు. ఉట్నూర్, జైనూర్, నార్నూర్, గుడిహత్నూర్, ఇచ్చోడ, ఆదిలాబాద్ మండలాలతో పాటు మండలంలోని సట్వాజిగూడ, ఇంద్రవెల్లి, ఏమాయికుంట, కెస్లాగూడ, ముత్నూర్, గలియబాయితండా, హీరాపూర్ గ్రామాలకు చెందిన 150 మంది యువకులు ఉచిత శిక్షణకు హాజరవుతున్నారు. ఆర్మీలో ఉద్యోగం సాధించేలా 3 నెలల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్ఐ నందిగామ నాగ్నాథ్ దగ్గరుండి శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇద్దరు రిటైర్డ్ ఆర్మీ జవాన్లు సూర్యకాంత్ కేంద్రే, బీ. జైసింగ్ ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటలు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆర్మీ ఉద్యోగం సాధించేందుకు కావాల్సిన అన్ని రకాల శిక్షణ ఇస్తున్నారు. 150 మందిని గ్రూపులుగా విభజించి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 1600 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్, హై జంప్ తదితరవి నిర్వహిస్తున్నారు. బరువు, ఎత్తుతో పాటు ఛాతి కొలతలు తీసుకుంటున్నారు. శిక్షణ పొందుతున్న వారిలో దాదాపు 60 శాతం యువకులు ఆర్మీలో ఉద్యోగం సాధిస్తారని కోచ్‌లతో పాటు పోలీసులు చెబుతున్నారు.
ఆర్మీలో ఎంపికకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
మండలకేంద్రంలో ప్రభుత్వం ఆర్మీలో ఎంపికకు సిద్ధమయ్యేలా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యువకులు కోరారు. మండల కేం ద్రంలో గ్రౌండ్ అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ భూమిలో తాత్కాలికంగా గ్రౌండ్ ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పోలీస్ అధికారులతో పాటు కలెక్టర్, మండల ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శాశ్వతమైన ఆర్మీ శిక్షణ గ్రౌండ్‌ని ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉద్యోగం సాధించి తీరుతా
ఇంద్రవెల్లి ఎస్ఐ నందిగామ నాగ్నాథ్ సార్ ఉచిత ఆర్మీ శిక్షణ ఇప్పిస్తున్నారు. వారం నుంచి ప్రతి రోజూ శిక్షణకు వస్తున్న. ఇద్దరు మాజీ సైనికులు అన్ని రకాల కసరత్తులు చేపిస్తున్నారు. ఎస్ఐ నందిగామ నాగ్నాథ్ సార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మాతో కలిసి శిక్షణలో చురుగ్గా పాల్గొంటున్నారు. కచ్చితంగా ఆర్మీలో ఉద్యోగం సాధించి తీరుతా. అందుకు తగ్గట్లుగా కష్టపడుతున్నా.
-అనికేత్ బద్నే, ఇంద్రవెల్లి
ఇంతమంది వస్తారనుకోలేదు
ఆర్మీలో ఉద్యోగం చేసి ఇటీవల రిటైర్డ్ అయ్యాను. ఉట్నూర్ డివిజన్ పరిధి నుంచి యువకులు పెద్ద సంఖ్యలో ఆర్మీలో చేరాలనే లక్ష్యంతో ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ప్రస్తుతం 150 మంది యువకులు శిక్షణ పొందుతున్నారు. ఇంతమంది యువకులు వస్తారనుకోలేదు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి..
గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత ఆర్మీలో ఎంపికకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. పక్క మండలాల నుంచే గాకుండా ఇంద్రవెల్లి మండలం నుంచి 150 మంది శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. కనీసం 50 మందిపైకి పైగా ఉద్యోగాలు సాధిస్తారన్న నమ్మకముంది. వీరికి అన్ని రకాల శిక్షణ ఇస్తున్నాం. గతేడాది నిర్వహించిన ఉచిత ఆర్మీ శిక్షణలో 110 మందిలో 35 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించకపోవడంతో ఉద్యోగంలో చేరలేదు. ఉచిత ఆర్మీ శిక్షణను యువకులు సద్వినియోగం చేసుకోవాలి. – ఎస్ఐ నందిగామ నాగ్నాథ్, ఇంద్రవెల్లి