
బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలి
కార్మికులకు సంఘాల పిలుపు
వర్క్‌షాప్, గనులపై సమావేశాలు
శ్రీరాంపూర్, డిసెంబర్ 8: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, పారిశ్రామిక వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా కార్మికవర్గం ఈ నెల 9 నుంచి 11 వరకు 72 గంటల సమ్మెలో పాల్గొని కుట్రలను తిప్పికొట్టాలని సింగరేణి కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్ ఆర్కే 5, 7గనులపై, ఏరియా వర్క్‌షాప్ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన సమావేశాల్లో సింగరేణి కార్మిక సంఘాల ప్రతినిధులు, టీబీజీకేఎస్ మాజీ అధ్యక్షుడు కెంగర్ల మలయ్య, కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జే శంకర్రావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీ సీతారామయ్య, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, కేంద్ర ఉపాధ్యక్షుడు పేరం రమేశ్, సీఐటీయూ డిప్యూటీ ప్రధానకార్యదర్శి రామగిరి రామస్వామి, హెచ్ఎంఎస్ కార్యదర్శి తిప్పారపు సారయ్య పాల్గొని మాట్లాడారు. కార్మికులు 72 గంటల సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సింగరేణి నాలుగు బొగ్గు బ్లాకులు వేలం వేయడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గనులు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల కార్మికులు నష్టపోతారని పేర్కొన్నారు. గని ప్రమాద కార్మిక కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, కారుణ్య నియామక వయసు 35 నుంచి 40 ఏండ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, కార్మికుల పేర్లలో దొర్లిన తప్పిదాలు సవరించాలన్నారు. కార్మిక వర్గం పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నదని చెప్పారు. సమావేశంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్‌రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి, పిట్ కార్యదర్శులు మెండ వెంకటి, వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీసైదా, ఐఎన్టీయూసీ నాయకులు భీంరావు, గరిగె స్వామిలు పాల్గొన్నారు.