
జాబితాలో తప్పులను సవరించుకోవాలి
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
హాజీపూర్, అక్టోబర్ 8 : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి ఆర్డీవో, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం-2020పై సమీక్షిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ 1-1-2022 తేదీ నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు తప్పులను సవరించాలన్నారు. నవంబర్ 1న సమీకృత ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ, నవంబర్ 30 వరకు అభ్యంతరాలు, వినతుల స్వీకరణ, నవంబర్ 1 నుంచి 30లోగా రెండు శనివారాలు, రెండు ఆదివారాల్లో ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాల నిర్వహణ, డిసెంబర్ 20 వరకు అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కారం, ఓటర్ల జాబితాను 5-01-2022 తేదీ రోజు
ప్రచురిస్తామని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 1500 మంది ఓటర్లను కేటాయిస్తామని చెప్పారు. రాజకీయ పార్టీల నాయకులు తమ అభ్యంతరాలు దరఖాస్తు రూపంలో అందించాలని సూచించారు. ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌ను వినియోగించుకోవాలన్నారు ఫారం నం- 6 ద్వారా ఓటరు నమోదు, చిరునామా మారినప్పుడు ఫారం-8ఏ, ఏమైనా సవరణలుంటే ఫారం-8, జాబితాలో పేరు తొలగింపునకు ఫారం-7 ద్వారా దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. అనంతరం ఓటరు హెల్ప్‌లైన్‌పై పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు వేణు, శ్యామలాదేవి, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.