
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రంగంలోకి అధికారులు
పూర్తి పరిశీలన అనంతరం పత్రాలు అందజేత
ఉమ్మడి జిల్లాలో 1,08,959 ఎకరాల్లో పోడు వ్యవసాయం
మంచిర్యాలలో కలెక్టర్ భారతీ హోళికేరి సమీక్ష
ఆదిలాబాద్, నవంబర్ 7 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి):పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. అటవీ భూమిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న గిరిజనులకు పట్టాలు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నది. గ్రామాల్లో ఫారెస్ట్ రైట్స్ కమిటీల ఆధ్వర్యంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉండగా, పరిశీలన అనంతరం అర్హులందరికీ హక్కు పత్రాలు అందించేలా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,08,959 ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నట్లు గుర్తించిన అటవీశాఖ,మూడు దశల్లో దరఖాస్తులను పరిశీలించనున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు రైతులకు ఎలాంటి హక్కు పత్రాలు లేకపోవడంతో అనేక సంక్షేమ పథకాలు అందడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పోడు భూ ముల సమస్యను పరిష్కరించాలంటూ సీఎం కేసీఆర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ మేరకు సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. అంతేగాకుండా మం త్రులు, అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. పట్టాల పంపిణీ ప్రక్రియలో భాగంగా అధికారులు, వివిధ పార్టీల నాయకులు, గిరిజన సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి సలహాలు సూచనలు స్వీకరించారు. అర్హులైన వారికి పట్టాలు పంపిణీ చేసిన తర్వాత అడవుల సంరక్షణకు సహకారం అందిస్తామన్నారు. జిల్లాలో పట్టాల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏలు, బీట్ అధికారులతో గ్రామస్థాయి సూపర్వైజర్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు గ్రామాల్లో అటవీభూములు సాగుచేస్తున్న గిరిజనులు దరఖాస్తు ఎలా చేసుకోవాలని విషయాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్లు సైతం వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి పట్టాల పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
పోడు రైతుల సోమవారం నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 2005 డిసెంబర్ 13 కంటే ముందు సాగు లో ఉన్న వారు హక్కు పత్రాలు పొందడానికి అర్హులు కాగా, గ్రామాల్లో ఫారెస్ట్ రైట్స్ కమిటీలు గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాయి. భూముల హక్కుల విషయంలో జిల్లా స్థాయి కమిటీదే తుది నిర్ణయమవుతుంది. పది ఎకరాల వరకు అర్హులు కాగా, నిబంధనల్లో సూచించిన విధం గా పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సాగు భూములకు సం బంధించిన పత్రాలు తీసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఆ వివరాలను పరిశీలించిన డివిజన్ స్థాయి అధికారులు జిల్లా స్థా యి కమిటీకి సిఫార్సు చేస్తారు. గ్రామస్థాయి అటవీ హక్కుల క మిటీలు గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
ఉమ్మడి జిల్లాలో 1,08,959 ఎకరాల్లో సాగు..
ఉమ్మడి జిల్లాలో 1,08,959 ఎకరాల అటవీభూముల్లో వ్యవసాయం చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో 56,140 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 19,5 43 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 8,276 ఎకరాలు, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 25 వేల ఎకరాల్లో పోడు వ్యవసాయం జరుగుతున్నట్లు క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి నిర్ధారించారు. 2006లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 37,324 మంది రైతులకు 1,36,116 ఎకరాల అటవీ భూములను సాగు చేస్తున్న గిరిజన రైతులకు అధికారులు హక్కు పత్రాలు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 17, 657 మంది రైతులకు 69,654 ఎకరాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 12,635 మంది రైతులకు 46,329 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 5500 మంది రైతులకు 16,589 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 1532 మంది రైతులు 3544 ఎకరాల భూములను అధికారులు పంపిణీ చేశారు.
మంచిర్యాల జిల్లాలో
మంచిర్యాల, నవంబర్ 7, నమస్తే తెలంగాణ : జిల్లాలో 82 పంచాయతీలు, 106 హ్యాబిటేషన్లలో పోడు సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 3,456 మంది రైతుల ఆధీనంలో 8,276 ఎకరాల పోడు భూములు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ నెల 8 నుంచి గ్రామ కమిటీలు సభలు ఏర్పాటు చేసి పోడుదారుల నుంచి అర్జీలు స్వీకరిస్తాయి. ఇప్పటికే ఈ విషయమై కలెక్టర్ భారతీహోళీకేరి సంబంధిత అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు.
ఐదు రోజుల పాటు సభలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు పోడుదారుల నుంచి ఈ నెల 8 నుంచి 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ మేరకు సోమవారం నుంచి గ్రామ కమిటీలు సభలు నిర్వహిస్తాయి. 18 ఏండ్లు నిండినవారిలో కనీసం 50 శాతం మంది సభకు హాజరుకావాల్సి ఉంటుంది. హాజరైన వారు అటవీహక్కు చట్టం 2006 ప్రకారం అర్హత గలవారికి పోడు పట్టాలు జారీ చేసిన తర్వాత అటవీ భూమి ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాకుండా పర్యవేక్షిస్తామని, అటవీ భూముల పరిరక్షణకు ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. వారిలో 10 నుంచి 15 మందితో గ్రామ స్థాయి కమిటీ అటవీహక్కుల కమిటీ (ఎఫ్ఆర్సీ)ని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలకు పర్యవేక్షణ బృందాలు సహకరిస్తాయి. ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దరఖాస్తుల స్వీకరణను కలెక్టర్ పర్యవేక్షిస్తారు. గ్రామ సభల ఏర్పాటు, దరఖాస్తుల స్వీకరణపై ఆమె ఆదివారం సంబంధిత అధికారులతో పటేల్ గార్డెన్స్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సభలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయినట్లు అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.