
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 7: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా దుర్గామాత, శారదా దేవి విగ్రహాలను భక్తులు ప్రత్యేక మండపాల్లో ప్రతిష్టించారు. అమ్మవార్లకు తొలిరోజుల ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలో సుమారు 200 వరకు అమ్మవారి మండపాలు ఏర్పాటు చేశారు.
తాంసి, అక్టోబర్ 7: తాంసి, కప్పర్ల, జామిడి, వడ్డాడి, పొన్నారి, సవర్గాం, గిరిగాంలలో భక్తులు దుర్గామాత, శారదాదేవి విగ్రహాలను ఏర్పాటు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు ఉపవాస దీక్షలు ప్రారంభించారు. పలువురు యువకులు భవానీ దీక్షలు స్వీకరించారు.
ఇంద్రవెల్లి, అక్టోబర్7 : మండల కేంద్రంలోని రాధాకృష్ణమందిరం, బజార్గల్లీ, ప్రధాన్గూడతోపాటు మండలంలోని ధనోరా(బీ), ముత్నూర్, హీరాపూర్, గౌరాపూర్లో దుర్గామాత విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఇంద్రవెల్లి గ్రామపటేల్ మారుతి పటేల్ డోంగ్రే, గ్రామస్తులు జవహర్లాల్, సంతోష్, కిశోర్ కుమార్, కైలాస్, విజయ్‌కుమార్, ప్రకాశ్ పాల్గొన్నారు.
బోథ్, అక్టోబర్ 7: మండలంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. అమ్మవారి ప్రతిమలతో ఊరేగిపుంగా మండపాలకు చేరుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో అమ్మవార్లను ప్రతిష్టించారు. పలువురు యువకులు అమ్మవారి దీక్ష స్వీకరించారు. నేరడిగొండ, అక్టోబర్ 7 : తేజాపూర్, నేరడిగొండ, వడూర్, కుమారి గ్రామాల్లో దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు. రాజురా దుర్గామాత ఆలయంలో జడ్పీటీసీ జాదవ్ అనిల్ దంపతులు పూజలు చేశారు. వేద పండితుడు శ్రావణ్ కుమార్ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.
భీంపూర్ , అక్టోబర్ 7: కరంజి (టీ), గుబ్‌డి, గోముత్రి, అంతర్గాం, పిప్పల్‌కోటి, నిపాని, ధనోరా తదితర గ్రామాల్లో అమ్మవారి విగ్రహాలను మండపాల్లో ప్రతిష్టించారు. పిప్పల్‌కోటిలో ముస్లింలు శారదాదేవి పూజల్లో పాల్గొన్నారు. టేకిడిరాంపూర్ పరిధి మారుమూల గుట్టపై ఉన్న కొజ్జన్గూడలో దుర్గామాతను ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఉత్సవాలు ముగిసే దాకా గిరిజనులంతా మద్యం, మాంసా హారానికి దూరంగా ఉంటూ అమ్మవారిని పూజిస్తారు. పూజల్లో మడావి జైవంత్‌రావు, పాండురంగ్, మారుతి, ధర్ము, వాసుదేవ్, జనార్దన్, గ్రామస్తులు ఉన్నారు.