
జైనూర్, జనవరి 7: చట్టవ్యతిరేక కార్యకలాపాలు అరికట్టేందుకు పోలీసులకు ప్రజలకు సహకరించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్‌కుమార్ సూచించారు. శుక్రవారం మండలంలోని డబోలి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. అంతకు ముందు కుమ్రం భీం విగ్రహానికి ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. సంఘద్రోహ శక్తులకు సహకరించొద్దని, అపరిచితులు ప్రాంతంలో సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆదివాసులు పిల్లలను చదివిస్తేనే అన్ని రంగాల్లో ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక రాజు, ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్‌రావు, సీఐ హనోక్, ఎస్ఐ తిరుపతి, సర్పంచులు మడావి భీంరావు, కుంర శ్యాంరావు, నాగోరావు, రాహుల్, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం శంకర్, నాయకులు, పోలీసు సిబ్బంది, ప్రజలున్నారు.