
ఇంద్రవెల్లి, జనవరి 7 : నాగోబా ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని మెస్రం వంశీయులకు పీఠాధిపతి మెస్రం వెంకట్రావు పటేల్ పిలుపునిచ్చారు. పురాతన ఆలయం (మురాడి) ఆవరణలో శుక్రవారం పీఠాధిపతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల నుంచి మెస్రం వంశీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ నిర్మాణం, జాతర నిర్వహణ, మెస్రం వంశీయుల నుంచి సేకరించే విరాళాలపై చర్చించారు. వంశీయుల నుంచి రూ.10,00,731 విరాళంగా సేకరించినట్లు చెప్పారు. ఆలయ నిర్మాణం తుది దశకు చేరుకున్నదన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నుపటేల్, బాధిరావ్‌పటేల్, లింబారావ్పటేల్, మెస్రం దుర్గు, సోనేరావ్, దేవ్‌రావ్, ఆనంద్‌రావ్, నాగ్నాథ్, శేఖర్‌బాబు, తుకారాం, మెస్రం షేకు, హన్మంత్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.
నాగోబాను దర్శించుకున్న ఎస్పీ..
ఆలయంలో ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్‌కుమా ర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, నాగోబాను దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్‌రావ్, కెస్లాపూర్ మాజీ సర్పంచ్ మెస్రం నాగ్నాథ్ ఆధ్వర్యంలో ఎస్పీని సన్మానించారు. నాగోబా ఫొటోను అందజేశారు. అనం తరం ఆలయ స్తంభాలను, వాటిపై చెక్కిన శిల్పాలను పరిశీలించారు. ఆలయ చరిత్ర గురించి వంశీయులను అడిగి తెలుసుకున్నారు. ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, ఉట్నూర్ సీఐ సైదారావ్, ఎస్ఐ నందిగామ నాగ్నాథ్, నాగోబా ఆలయ పూజారి మెస్రం షేకు, మెస్రం వంశీయులు పాల్గొన్నారు.