
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి
నచ్చన్ ఎల్లాపూర్‌లో కేంద్ర వైద్య బృందం సభ్యులు
కడెం, జనవరి 7 : ప్రజలు రోగాల బారిన పడకుండా మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర వైద్య బృందం సభ్యులు డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ స్టీఫెన్, డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. స్వెరో సర్వేలో భాగంగా ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) ఆధ్వర్యంలో మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో శుక్రవారం వారు పర్యటించారు. పంచాయతీ పరిధిలోని పెత్తార్పు, గొండుగూడెం, నచ్చన్ఎల్లాపూర్ గ్రామాల్లోని 40 మంది రక్త నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పది గ్రామ పంచాయతీలను ఎంపిక చేసినట్లు, నచ్చన్ ఎల్లాపూర్ ఎంపికవడంతో సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొవిడ్ వైరస్ నుంచి కోలుకున్న వారిలో ఇమ్యూనిటీ, గ్రామాల్లో ప్రజలకు వస్తున్న వ్యాధులు, దానికి గల కారణాలపై రక్త నమూనాలు సేకరించినట్లు తెలిపారు. అలాగే వ్యాక్సిన్ వేసుకున్న వారి నుంచి కూడా రక్త నమూనాలు తీసుకున్నట్లు చెప్పారు. వాటిని హైదరాబాద్‌కు పంపిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం పలు వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు గంగన్న, కడెం పీహెచ్సీ వైద్యుడు నాగరాజు, సూపర్వైజర్ జాదవ్ గోపాల్, హెల్త్ అసిస్టెంట్ భూమేశ్, శైలేందర్, ఏఎన్ఎం కృష్ణవేణి, స్పందన స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.