శ్రీరాంపూర్, అక్టోబర్ 6: సీఎం నిర్ణయం మేరకు కార్మికులకు లాభాల వాటా ఈ నెలలోనే ఇవ్వాలని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య డైరెక్టర్ బలరాంను కలిసి బుధవారం కోరారు. తమ విజ్ఞప్తి మేరకు డైరెక్టర్ బలరాం కార్మికులకు ఆర్థ్ధిక మొత్తాలు చెల్లించడానికి నిర్ణయించారని వారు చెప్పారు. ముందుగా ఈ నెల 8న కార్మికులకు రూ. 25,000 దసరా అడ్వాన్స్ చెల్లిస్తారని చెప్పారు. ఈ నెల 11న సింగరేణి సంస్థ లాభాలు 29 శాతం రూ.80 కోట్లు కార్మికులకు చెల్లిస్తారని పేర్కొన్నారు. నవంబర్ 1న కార్మికులకు దీపావళి బోనస్ రూ.72,500 బ్యాంకు ఖాతాల్లో వేస్తారని చెప్పారు. పెంపునకు కృషి చేసిన తమ అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్రావ్, రాజిరెడ్డి, గౌరవ అధ్యక్షురాలు కవిత, మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు.