
శనగ, మక్క పంటల సాగు
ఆదా అవుతున్న నీటి తడులు
బోథ్, డిసెంబర్ 5: ఆరుతడి పంటల సాగుకు అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ నీటి తడులు అవసరమైన పంటలు వేస్తున్నారు. బోథ్ మండలంలో యాసంగి కింద రైతులు ఆరుతడి పంటలు వేయడానికి మొగ్గు చూపుతున్నారు. రెండు, మూడు నీటి తడులతో చేతికి వచ్చే పంటల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. విద్యుత్ ఆదా అవుతుండడంతో ఈ పంటలు వేస్తున్నారు. ప్రధానంగా శనగ, మక్క, ధనియాలు, జొన్నతో పాటు విత్తనోత్పత్తి జొన్న పంటలు సాగు చేస్తున్నారు. వానకాలం సాగు చేసిన సోయా, మినుము, పెసర పంటలతో పాటు పత్తి పంటను తొలగించి వీటిని వేస్తున్నారు. చెరువులు, ప్రాజెక్టుల కింద కాలువల ద్వారా నీటి సౌకర్యం, బోరుబావుల వసతి ఉన్న రైతులు ఆరుతడి పంటలు వేస్తున్నారు. శనగ పంటకు విత్తనాలు వేసే సమయంతో పాటు కాత దశలో నీటి తడిని అందిస్తే శీతాకాలంలో కురిసే మంచుతో పంట చేతికి వచ్చే అవకాశాలు ఎక్కువ. 9 వేల ఎకరాల్లో శనగ పంట వేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 1200 ఎకరాల్లో మక్క, 900 ఎకరాల్లో జొన్న, 100 ఎకరాల్లో ధనియాలు, తదితర ఆరుతడి పంటలు పండిచ్చవచ్చని అంచనా వేస్తున్నారు.
నాలుగెకరాల్లో శనగ సాగు చేస్తున్న..
నాలుగెకరాల్లో శనగ పంట సాగు చేస్తున్నా. ఈ పంటకు నీటి తడుల అవసరం ఎక్కువ ఉండదు. విత్తనాలు పోసే సమయంలో ఓ తడి, మధ్యలో మరో నీటి తడి ఇస్తే పంట చేతికి వస్తుంది. రెండు, మూడేళ్లుగా యాసంగిలో శనగ పండిస్తున్నా.
-రాథోడ్ బిక్కులాల్, రైతు, ఖండిపల్లె