
18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ ఓటు హక్కు కల్పించాలి
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఎదులాపురం,అక్టోబర్5: 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కళాశాలల విద్యార్థుల ఓటరు నమోదుపై ప్రభుత్వ , ప్రైవేట్ కళాశాలలు, డైట్ కళాశాల ప్రిన్సిపాళ్లతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సమావేశమై మాట్లాడారు. గత ఏడాది కొవిడ్ కారణంగా ఓటరు జాబితాలో పేర్ల నమోదు తక్కువగా ఉందన్నారు. ప్రతీ విద్యార్థి పేరు జాబితాలో నమోదు చేయాల్సిన బాధ్యత ఆయా ప్రిన్సిపాళ్లపై ఉందన్నారు. విద్యార్థులంద రికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా నమోదు చేయవచ్చన్నారు. జిల్లాలోని 14 మండలాల్లో 22 డిగ్రీ, 33 జూనియర్ కళాశాలలు ఉన్నాయని మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ తెలిపారు. 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారి పేర్లను ఓటర్ గా నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ప్రిన్సిపాళ్లు ఉన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పించాలి
కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన , మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కళాశాలల విద్య, వనరుల కేంద్రం కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులకు భావిజీవితంలో అవసరమయ్యే బోధన అందించాలన్నారు. అందుకు తగిన సౌకర్యాలు, శిక్షణ ఇప్పించాలని సూచించారు. జిల్లాలోని హాస్టళ్లలో వసతులు కల్పించాలన్నారు. ఉపాధి కల్పన, జిల్లా వనరులు కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ కేంద్రాల్లో శిక్షణ ఇప్పించాలని సూచించారు. అంతకు ముందు ప్రభుత్వ డిగ్రీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కన్వీనర్ డాక్టర్ రెహత్ ఖానం కళాశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు , విద్యార్థుల వివరాలు , విద్యాబోధన ,మౌలిక సదుపాయాలపై వివరించారు. సమావేశంలో జిల్లా ఉపాధికల్పన అధికారి కిరణ్ కుమార్, సంక్షేమ శాఖల అధికారులు రాజలింగం, సంధ్యారాణి, సునీత, కృష్ణవేణి, వైస్ ప్రిన్సిపాల్ ప్రతాప్సింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.