
ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి
వెకిలిచేష్టలు మానకపోతే ప్రజలు బుద్ధి చెబుతారు
రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల
ఆదిలాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మతిభ్రమించిందని, రాష్ట్ర సర్కారుపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ అగ్రనేతలు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలని దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణ శాఖ మాత్యులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్‌లో జరిగిన రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన నడ్డాపై విరుచుకుపడ్డారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని, అవినీతి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, వెకిలి చేష్టలు మానకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి ఘాటుగా స్పందించారు. ప్రధాని మోడీ మేకిన్ ఇండియా పాలసీని పక్కన పెట్టి సేల్ ఇండియా విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ అగ్రనేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ సర్కారు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనిట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అద్భుతంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని డిస్కవరీ చానల్లో ప్రసారమైందని మంత్రి గుర్తు చేశారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లానీరు సరఫరా అవుతుందని, స్వచ్ఛమైన నీటిని తాగి ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నట్లు తెలిపారు.
ఉద్యోగులు సమస్యలపై పోరాటం చేస్తామంటున్న జేపీ నడ్డా, కేంద్రం 70 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర సర్కారు నిర్ణయంతో లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రధాన నరేంద్రమోడీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని మోడీ మేకిన్ ఇండియా పాలసీని పక్కన పెట్టి సెల్ ఇండియా విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి, ఎలాంటి అనుమతులు లేకుండా దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకుంటే బీజేపీ కార్యకర్తలు పోలీసులపై దాడులు చేసినందుకు కేసులు నమోదు చేశారన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్న రైతులను బీజేపీ కేంద్ర మంత్రి కుమారుని వాహనం ఢీకొన్న ఘటనలో చనిపోయిన రైతు కుటుంబాలను బీజేపీ మంత్రులు ఎందుకు పరామార్శించలేదన్నారు.