
సీఎం కేసీఆర్, సంక్షేమ పథకాలు తెలిపేవిధంగా రంగవల్లులు
ఇండ్రాయింగ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు.. బహుమతుల ప్రదానం..
ముగ్గులను తిలకించిన మంత్రి అల్లోల, విప్ సుమన్
ఆదిలాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు ఊరూవాడా అంబరాన్నంటాయి. మూడో రోజైన బుధవారం మంత్రి, విప్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతులు తమ ఇండ్లకు మామిడి తోరణాలు కట్టి అలంకరించారు. వాకిళ్లలో సీఎం కేసీఆర్, సంక్షేమ పథకాలను తెలియజేసే విధంగా ముగ్గులు వేసి తమ అభిమా నాన్ని చాటుకున్నారు. వేడుకల్లో మహిళలు, చిన్నారులు పాల్గొనడంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. మరో వైపు విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు మూడో రోజైన బుధవారం కనులపండువగా కొనసాగాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో విద్యార్థినులు, మహిళలు ముగ్గులు వేశారు. వీటిని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తిలకించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జామ్ కేజీబీవీలో ఇంటర్ చదువుతున్న సాయిసింధు రైతుబంధు పథకంపై దారాళంగా మాట్లాడడంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రముగ్ధులయ్యారు.ఈ విద్యార్థినికి శిక్షణ ఇవ్వాలని జిల్లా వ్యవసాధికారిని మంత్రి ఆదేశించారు. పెంబీలో ఎమ్మెల్యే రేఖానాయక్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ రంగవల్లులను తిలకించారు. అనంతరం బహుమతులు ప్రదానం చేశారు. ఇంటిముందు రంగవల్లులు వేయడంలో పండుగ వాతావరణం నెలకొంది. రైతుబంధు ప్రాధాన్యతను తెలుపుతూ ముగ్గులు వేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని ముగ్గు రూపంలో యువతులు ప్రదర్శించగా, ప్రభుత్వ పథకాలను కూడా వేశారు. ఇండ్లకు అరటి, మామిడి తోరణాలు కట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డ్రాయింగ్, ఉపన్యాసం, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో నిర్వహించిన సంబురాల్లో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.