
ఎడ్లబండి మార్గంపై చర్చించిన మెస్రం వంశీయులు
ఈ నెల 12వ తేదీన గంగాజలం సేకరణకు పాదయాత్ర
సంప్రదాయ బద్ధంగా బండిని సాగనంపిన పెద్దలు
ఇంద్రవెల్లి, జనవరి 5: మెస్రం వంశీయుల మహాపూజలతో ఈ నెల 31వ తేదీన ప్రారంభం కానున్న నాగోబా జాతరపై గ్రామాల్లో ప్రచారం నిర్వహించడానికి ఎడ్లబండి(చక్డా)ని కెస్లాపూర్‌లోని పురాతన నాగోబా దేవస్థానం(మురాడి)లో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం రాత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాల నుంచి మెస్రం వంశీయులు కెస్లాపూర్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. పురాతన నాగోబా ఆలయం(మురాడి)లో మెస్రం వంశీయులు సమావేశమై ప్రచారం నిర్వహించే ఎడ్లబండి మార్గంపై పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ సమక్షంలో చర్చించారు. సంప్రదాయ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార ఎడ్లబండి(చక్డా)ని ప్రారంభించారు. అనంతరం గ్రామ పొలిమేర వరకు ప్రచార ఎడ్లబండిని సంప్రదాయ ప్రకారం సాగనంపారు. పోలిమేరలో కటోడ కోసు, పర్దాంజీ దాదారావ్ నేలపై తంబాకు, బీడీలు వేసి అక్కడి నుంచి నాగోబాను మొక్కుకున్నారు. అనంతరం ఎడ్లబండిలో ప్రచారానికి బయలుదేరి వెళ్లారు. ముందుగా సిరికొండ మండలానికి చేరుకుంటారని మెస్రం పెద్దలు పేర్కొన్నారు. కుండల తయారీకి కుమ్మరికి ఆదేశాలు ఇచ్చి రాజంపేట్లో బస చేస్తారని వివరించారు.
6న గుడిహత్నూర్ మండలం సోయంగూడ, 7న ఇంద్రవెల్లి మండలం గిన్నేరా, 8న ఉట్నూర్ మండలం సాలేవాడ, 9న ఇంద్రవెల్లి మండలం పొల్లుగూడ, 10న వడగాం, 11న వడగాం నుంచి బయలుదేరి తిరిగి కెస్లాపూర్‌కు చేరుకుంటారని తెలిపారు. మెస్రం వంశీయుల పెద్ద మడావి ఇంట్టి వద్ద రాత్రి బస చేస్తారని వివరించారు. 12న గ్రామంలోని పురాతన నాగోబా ఆలయంలో పూజలు చేసి గంగాజలం సేకరించడానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లనున్నారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు చిన్నుపటేల్, బాదిరావ్ పటేల్, కోశరావ్, లింబారావ్, దేవ్‌రావ్, సోనేరావ్, నాగోరావ్, హనుమంత్‌రావ్, దాదారావ్, గణపతి, తిరుపతి, శేఖర్‌బాబు, నాగ్నాథ్, ఆనంద్‌రావ్, తుకారామ్, షేకు, సీతారామ్ పాల్గొన్నారు.