
బేల, జనవరి 5 : వ్యాక్సిన్‌తోనే కరోనా కట్టడి చేయవచ్చని జడ్పీటీసీ అక్షిత పవార్ అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాల, కీర్తన డిగ్రీ కళాశాల, చంద్పెల్లిలోని బాలికల ఆశ్రమ పాఠశాల, చప్రాల, సైద్పూర్ గ్రామాల్లో చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత, భౌతికదూరం పాటిస్తూ మాస్కు ధరించాలని సూచించారు. అనంతరం పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులపై సంబంధిత ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రం పరిశీలన
మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ పరిశీలించారు. టీకా వల్ల ఎలాంటి అపోహలు నమ్మవద్దని విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, సర్పంచ్ చంద్శౌవ్, ఎస్ఎంసీ చైర్మన్ సంతోష్ , ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది ఉన్నారు.
టీనేజర్లు కొవిడ్ టీకా వేసుకోవాలి
బోథ్, జనవరి 5: టీనేజర్లు కొవిడ్ టీకా వేసుకోవాలని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. సొనాల జడ్పీ పాఠశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ నవీన్‌రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ, జనవరి 5 : మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. 511 మంది విద్యార్థినులకు కొవిడ్ టీకా వేశామని ప్రభుత్వ వైద్యాధికారి ఆకుదారి సాగర్ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, వైద్య సిబ్బంది, ఆశకార్యకర్త లక్ష్మి పాల్గొన్నారు.
తాంసిలో..
భీంపూర్, జనవరి 5: తాంసిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జడ్పీ సీఈవో గణపతి, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి రాజు పరిశీలించారు. విద్యార్థులకు టీకాపై అవగాహన కల్పించారు. వారి వెంట ఎంపీడీవో ఆకుల భూమయ్య, ప్రిన్సిపాల్ సుదర్శన్, వైద్య సిబ్బంది, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సంతోష్‌కుమార్ ఉన్నారు.