
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
త్వరలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం
ఆదిలాబాద్ రూరల్, జనవరి 5 : ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తాము ముందుంటామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యపై పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ రాజీనామా అంశాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ చైర్మన్ తన పదవిని లెక్క చేయకుండా రాజీనామాకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ముడిపడి ఉందన్నారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభమయ్యేలా చూస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, నాయకుడు యూనిస్ అక్బానీ, ఎజాజ్, తదితరులు పాల్గొన్నారు.