అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు
శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
హరితహారం అద్భుత కార్యక్రమమంటూ ఎమ్మెల్సీ పురాణం ప్రశంస
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 4 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రసిద్ధ ఆలయాలన్నింటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గూడెం సత్యనారాయణ స్వామి, గంగాపూర్ వేంకటేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఇతర సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, ఎగ్గె మల్లేశ్ం, ప్రభాకర్ రావు అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. నిత్య కైంకర్యాలకు 3645 ఆలయాల్లో అర్చకులకు ధూపదీప నైవేద్య పథకం ద్వారా గౌరవ వేతనం , అర్చకులకు ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, కామన్ గుడ్ ఫండ్ నిధుల ద్వారా పురాతన ఆలయాలకు జీర్ణోద్ధరణ, నూతన ఆలయ నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నామని వివరించారు. రూ.50 కోట్లతో బాసర ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రస్తుతం రూ.8.40 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులతో అతిథి గృహాలు, షెడ్స్, ప్రహరీ ఇతర ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. డిసెంబర్ 2021 నాటికి ఇప్పుడు కొనసాగుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. దక్షిణ అయోధ్య భద్రాచల శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూ పొందిస్తున్నామని వెల్లడించారు. గోదావరి పుష్కరాల సమయంలో రూ.30 లక్షలతో గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద షెడ్లు, రోడ్ల నిర్మాణాలు, తాగు నీటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. రూ.26 లక్షలతో ఇతర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రూ.50 లక్షల వ్యయంతో గంగాపూర్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మండపం, విమాన గోపుర నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
హరితహారం అద్భుత కార్యక్రమం : ఎమ్మెల్సీ పురాణం
కోటపల్లి, అక్టోబర్ 3 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం అద్భుత కార్యక్రమం అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అన్నారు. శాసనమండలి సమావేశంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ మాట్లాడుతూ ఏ రాష్ట్రం, ఏ దేశం చేయని అద్భుత కార్యక్రమం హరితహారం అని, ఈ కార్యక్రమంతో రాష్ట్రంలో అటవీ విస్త్రీర్ణం పెరిగిందని తెలిపారు. చెట్లు లేక, వానలు కురియక గతంలో కరువు ఛాయలు కనిపించేవని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మొక్కల పెంపకంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, కరువు ఛాయలు కనిపించడం లేదన్నారు. అడవుల సంరక్షణపై సీఎం కేసీఆర్, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
మంచిర్యాలలో ఐటీ టవర్ ఏర్పాటు చేయాలి
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐటీ టవర్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారి ప్రపంచానికే ఆదర్శంగా మారిందన్నారు. ఐటీ రంగాన్ని పోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్‌ను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. 8, 9, 10వ తరగతులతో పాటు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ప్రోగ్రామింగ్ అనే సిలబస్‌ను చేర్చాలని సూచించారు. సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో మాదిరిగా మంచిర్యాలలో ఐటీ టవర్ల ఏర్పాటుతో చుట్టు పక్కల జిల్లాలోని వారికి ప్రయోజనం ఉంటుందని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు వేతనాలను పెంచినట్లు మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్లకు వేతనాలు పెంచాలని విన్నవించారు. అనంతరం రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
గ్రామ పంచాయతీల్లోని సమస్యలు పరిష్కరించాలి
-అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు
ఆసిఫాబాద్, అక్టోబర్ 4: గ్రామ పంచాయతీల్లో లలోని సమస్యలు పరిష్కరించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అసెంబ్లీ సభ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ వర్షాల సమావేశాల్లో క్వచ్ఛన్ అవర్‌లో నియోజకవర్గంలోని పలు సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకవెళ్తున్నారు. సోమవారం జరిగిన సమావేశంలో గ్రామ పంచాయతీల్లోని సమస్యలపై విన్నవించారు. కొత్త గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. మల్టీపర్పస్ వర్కర్లను అదనంగా కేటాయించాలని ఆ శాఖ మంత్రికి ఎమ్మెల్యే విన్నవించారు.
సింగరేణి స్థలాల్లో ఉంటున్న వారికి పట్టాలివ్వాలి
-బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లిటౌన్, అక్టోబర్ 4 : బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి స్థలాల్లో స్థిర నివాసాలు ఏర్పరుచుకున్న ప్రజలకు పట్టాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరారు. వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్
దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపాలిటీ పరిధిలో సింగరేణి సంస్థకు చెందిన స్థలంలో 5,500 మంది ఇళ్లు నిర్మించుకున్నారని పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 1926లో సింగరేణి ఇక్కడి ప్రాంతాన్ని లీజుకు తీసుకుందని తెలిపారు. అప్పటి నుంచి వారికి ఎలాంటి యాజమాన్యపు హక్కు లేదని వివరించారు. భూగర్భగనులు, ఇతర విభాగాలు ఎత్తివేయడంతో 2017లో అవసరం లేని భూమిని సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి అప్పగించిందన్నారు. పట్టాల కోసం 2700 మంది ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకున్నారని గుర్తు చేశారు. ఆన్లైన్లో నమోదు కటాఫ్ తేదీ తక్కువగా ఉండడంతో మిగతా మూడువేల మంది దరఖాస్తు చేసుకోలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు.