
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సగటున నాలుగు మీటర్లలోపే నీరు
అన్ని మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు
నిండుకుండలా చెరువులు, ప్రాజెక్టులు
మత్స్యకారుల్లో ఆనందం
యాసంగి సాగుకు ఇక ఢోకా లేదని సంబురం
నిర్మల్ టౌన్, అక్టోబర్ 4 : ఈ వానకాలం సీజన్లో విస్తారంగా కురిసిన వర్షాలకు భూగర్భ జలం ఉబికి వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీజన్కంటే ముందు 11 మీటర్ల లోతున ఉన్న నీరు ఇప్పుడు సగటున 4 మీటర్లలోపే అందుతున్నది. జూన్ నుంచి అక్టోబర్ వరకు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. చెరువులు, ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతుండగా, మత్స్యకారుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ఇక యాసంగి సాగుకూ ఢోకా ఉండబోదని రైతాంగం హర్షం వ్యక్తంచేస్తున్నది.
ఈ సీజన్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కురిశాయి. సాధారణం కంటే అన్ని జిల్లాల్లో ఇప్పటివరకు అధికంగానే వర్షపాతం నమోదైనట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్‌లో 1,005 మి.మీటర్ల సాధారణ వర్షపాతం ఉండగా.. ఇప్పటివరకు 1,383 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాలలో 986.8 మి.మీటర్లకుగాను 1,015.5 మి.మీ., నిర్మల్‌లో 953.4 మి.మీ, 1,410.5 మి.మీ., కుమ్రంభీం జిల్లాలో 1020.5 మి.మీటర్లకుగాను 1,375.1 మి.మీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. ఉమ్మడి జిల్లాలో 72 మండలాలున్నాయి. ఇందులో 41 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భజలాలు 12 నెలల తర్వాత ఇంత భారీ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి అని జిల్లా భూగర్భజలశాఖ అధికారి శ్రీనివాస్‌బాబు తెలిపారు.
నిండుకుండలా ప్రాజెక్టులు..
ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. అన్ని ప్రాజెక్టుల్లోకి వరద విపరీతంగా చేరడంతో గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. దీనికితోడు అధిక వర్షపాతంతో నీటివనరులన్నీ నిండాయి. కడెం, ఎస్సారెస్పీ, భైంసా సుద్దవాగు, స్వర్ణ, కరత్వాడ, వట్టివాగు, సాత్నాల, కుమ్రంభీం ప్రాజెక్టు, ఎల్లంపల్లి, తదితర ప్రాజెక్టులతో పాటు జిల్లాలోని 2,747 చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం ఈసారి వాగులపై 123 చోట్ల చెక్‌డ్యాంలను నిర్మించడంతో అక్టోబర్ నెలలోనూ అలుగు పారుతున్నాయి.
పైపైకి పాతాళగంగ..
నిర్మల్ జిల్లాలో మే నెలలో 11.43 మీటర్ల లోతులో ఉన్న జలాలు ఇప్పుడు 4.99 మీటర్లకు చేరుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 9.29 నుంచి 3.05కు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 8.71 నుంచి 4.76, మంచిర్యాల జిల్లాలో 7.35 నుంచి 4.77 మీటర్లకు చేరాయి. ఆదిలాబాద్ జిల్లాలో నార్నూర్, బజార్హత్నూర్, బోథ్, నేరడిగొండలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లాలో కుభీర్, తానూర్, బాసర, ముథోల్, భైంసా, దిలావర్పూర్, కుంటాల, మామడ మండలాల్లో 50శాతం అధికంగా వర్షం కురిసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 9 మండలాలు, మంచిర్యాల జిల్లాలో 8 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. నేరడిగొండ మండలంలో 2.5 మీటర్ల పైనే భూగర్భ జలాలున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇది అత్యంత భూగర్భజలమట్టంగా నమోదైనట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.
యాసంగి సాగుకు ఢోకా లేనట్లే..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కురిశాయి. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు నిండాయి. వాగులు, నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. దీంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది యాసంగి సీజన్‌కు నీటి కొరత ఉండబోదని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సీజన్లో సుమారు 17.50 లక్షల హెక్టార్ల పంట సాగు అవుతున్నది. యాసంగిలో 8-9 లక్షల ఎకరాల్లో పంట సాగవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవిలో సాగునీటి బోర్లు, చెరువుల కిందే రైతులు పంట వేసుకోవడంతో ప్రస్తుతం ఉన్న భూగర్భజలాలు, చెరువులు, ప్రాజెక్టుల్లో ఉన్న నీటి సామర్థ్యం నేపథ్యంలో రబీ సీజన్లో నీటి కొరత ఉండే అవకాశం లేకపోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. జీవనోపాధి మెరుగుపడేందుకు ఈ వర్షాలు ఎంతో ఉపయోగపడ్డాయని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.