
రైతులకు సిరులు కురిపిస్తున్న దూది
మద్దతు ధర కంటే రూ.3,575 అధికం
దిగుబడి తగ్గడం.. నాణ్యతే కారణం..
ఆదిలాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెల్లబంగారం ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నాయి. మార్కెట్ యార్డుల్లో మంగళవారం క్వింటాలు పత్తికి నిర్మల్‌లో రూ.9,600, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో రూ.9,500, ఆదిలాబాద్‌లో రూ.9,460, మంచిర్యాలలో రూ.9,000 ధర వచ్చింది. గిట్టుబాటు కంటే రూ.3,575 అధికంగా వచ్చాయి. ప్రధానంగా సాగు తగ్గడం, ఆశించిన మేర దిగుబడి రాకపోవడం, మన పత్తి నాణ్యతగా ఉండడం, జాతీయ స్థాయిలో డిమాండ్ ఉండడంతో రేటు పలుకుతున్నదని అధికారులు పేర్కొంటున్నారు. నూతన సంవత్సరంలో అంచనాలకు మించి ధర వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో యేటా వానకాలంలో 80 శాతం పత్తి పంట సాగవుతున్నది. ఈ ఏడాది 3.90 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి వేశారు. సకాలంలో వర్షాలు పడడం, వాతావరణం సహకరించడంతో దిగుబడులపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. అయితే అక్టోబర్‌లో కురిసిన వర్షాల కారణంగా పూత, కాత రాలిపోవడంతో దిగుబడులపై ప్రభావం పడింది. ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.6025 ప్రకటించింది. సీసీఐ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 10 చోట్ల కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్ల ధర రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఉండడంతో డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. పది రోజుల కిందట క్వింటాలుకు రూ.8200 ధర ఉండగా, క్రమంగా పెరుగుతూ వచ్చింది. మంగళవారం జిల్లాలో క్వింటాలు ధర రూ.9460 పలికింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 6.87లక్షల క్వింటాళ్ల పంటను సేకరించారు. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో 4.67 లక్షల క్వింటాళ్లు, బోథ్‌లో 82 వేల క్వింటాళ్లు, ఇంద్రవెల్లిలో 81 వేల క్వింటాళ్లు, ఇచ్చోడలో 37 వేల క్వింటాళ్లు, జైనథ్ మార్కెట్‌యార్డులో 18 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు.
భైంసాలో క్వింటాలుకు రూ. 9,600
భైంసా, జనవరి 4 : భైంసా మార్కెట్లో పత్తి రైతులకు సిరులు కురిపిస్తున్నది. గతంలో లేని విధంగా మంగళవారం క్వింటాల్ రూ.9,600 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి డిమాండ్ అధికంగా ఉండడంతో వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో రూ. 9500
ఆసిఫాబాద్ అంబేద్కర్‌చౌక్, జనవరి 4 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి ధరలకు రెక్కలు వస్తున్నాయి. కొనుగోళ్లు ప్రారంభంలో రూ.7 వేలు ఉండగా క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ఆసిఫాబాద్‌లోని పలు జిన్నింగ్ మిల్లుల్లో మంగళవారం తేమ శాతం 8 ఉన్న పత్తికి గరిష్టంగా రూ.9400 నుంచి రూ.9500 వరకు ధర పలికింది. ఇదిలాఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగి రూ.10 వేలు దాటే అవకాశం ఉందని రైతన్నలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మంచిర్యాల జిల్లాలో క్వింటాలుకు రూ.9వేల ధర పలికింది.
పంట తక్కువగా వస్తుంది..
సీజన్ ప్రారంభం నుంచి పత్తి మార్కెట్‌కు తక్కువగా వస్తున్నది. పంట చివరిదశలో కురిసిన వర్షాల కారణంగా దిగుబడి తగ్గింది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 6.87 లక్షల క్వింటాళ్ల పత్తిని మాడల్ ధరతో కొనుగోలు చేశాం. మార్కెట్‌యార్డుల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా చూస్తున్నాం. ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో జిన్నింగ్ల్లో తనిఖీలు చేపడుతున్నాం. – శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి, ఆదిలాబాద్
రూ. 9500తో తీసుకున్నారు..
ఆసిఫాబాద్‌లోని ఓ జిన్నింగ్ మిల్లులో మంగళవారం 25 క్వింటాళ్ల పత్తిని అమ్మాను. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.9500 ధర చెల్లించారు. ఈసారి దిగుబడి తక్కువ వచ్చిందని బాధపడ్డాను. కానీ పంటకు మంచి ధర రావడంతో కొంత ఊరట లభించినట్లయ్యింది. రానున్న రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.-ప్రణయ్‌కుమార్, ఆసిఫాబాద్