
జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు షేహజాది
నిర్మల్ జిల్లా అధికారులతో సమావేశం
నిర్మల్ టౌన్, జనవరి 4 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు విద్యార్థులకు పారదర్శకంగా అందేలా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు షేహెజాది సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వివిధ సంక్షేమ పథకాలను శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మైనార్టీ విద్యార్థుల్లో డ్రాప్ అవుట్లు తగ్గించి ప్రతి విద్యార్థిని బడిలో చేర్పించాలని సూచించారు. 1,08,381 మంది మైనార్టీలుంటే జిల్లాలో వారి కోసం గురుకుల పాఠశాలలు అందుబాటులో ఉన్నాయని ఆ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించాలని కోరారు. అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో రాథోడ్ రమేశ్, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి స్రవంతి, ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ సలీమొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల సందర్శన
జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను జాతీయ కమిషన్ సభ్యురాలు షేహజాది సందర్శించారు. కస్బా, గురుకుల బాలికలతో పాటు ఎన్బీఆర్లో నిర్వహిస్తున్న బాలుర పాఠశాలను సందర్శించారు. విద్యాబోధనను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీకి, కమిషన్ సభ్యురాలికి పుష్పగుచ్ఛం అందించారు. మైనార్టీ కమిషన్ సభ్యురాలికి నిర్మల్‌కు చెందిన ఎంఐఎం నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు కలిసి పలు వినతిపత్రాలు ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నాయకులు సభ్యురాలిని కలిసి ఉర్దూ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతిపత్రం అందించారు. జిల్లా అధ్యక్షుడు అతరొద్దీన్, కార్యదర్శి జాబీర్ హుస్సేన్, ఇర్ఫాన్ షేక్, షబ్బీర్ అలీ పాల్గొన్నారు.