
ఎదులాపురం, నవంబర్ 3 : సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు బేరియం సాల్ట్ మిశ్రమ పటాకుల విక్రయాలపై నిషేధం ఉందని, వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర బుధవారం హెచ్చరించారు. న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను ఎవరు ఉల్లంఘించినా చట్టపరమైన శిక్షకు అర్హులవుతారని పేర్కొన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తెలిసి విక్రయించినా తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు. చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత పటాకుల ఉత్పత్తులను ప్రజలకు విక్రయించరాదని సూచించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పటాకుల విక్రయ దుకాణాలపై పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా బేరియం ఉప్పు పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులు విక్రయిస్తే సంబంధిత పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్ అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అనుమతి పొందిన వారు మాత్రమే పటాకుల దుకాణాలు నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. జనావాసాలకు దూరంగా పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని, అగ్ని ప్రమాదాలు సంభవిస్తే నివారించేందుకు నీరు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
పటాకుల విక్రేతపై కేసు
సుప్రీం కోర్డు ఆదేశాల మేరకు బేరియం సాల్ట్ మిశ్రమం కలిగి ఉన్న పటాకులు విక్రయిస్తున్న దుకాణదారుడిపై కేసు నమోదైంది. ఈ మేరకు మావల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్ పరిసరాల్లో మనీశ్ ఫైర్ క్రాకర్స్ షాపులో నిషేధిత బేరియం సాల్ట్ మిశ్రమంతో కూడిన పటాకులు అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఫైర్ ఆఫీసర్ శివాజీతో కలిసి తనిఖీ చేశారు. ఇందులో బేరియం సాల్ట్ మిశ్ర మ బాణసంచా 50 బాక్స్లున్నట్లు గుర్తించారు. క్రాకర్స్ షాపును సీజ్ చేశారు. విక్రేయదారుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు క్రాకర్స్ షాపులు తనిఖీలు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.