
మోస్తరు వర్షం కురియడంతో చేల వద్ద సందడి
విత్తనాల కొనుగోళ్లలో రైతన్న బిజీబిజీ
అందుబాటులో ఎరువులు
ఆదిలాబాద్, జూన్ 3 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :సర్కారు అందిస్తున్న సాయంతో రైతులు సంబురంగా సాగుకు కదులుతున్నారు. ఈ ఏడాది వానకాలం ప్రారంభంకావడంతో చేల వద్ద సందడి నెలకొంది. బుధవారం మోస్తరు వర్షం కురియడంతో ఇప్పటికే భూములు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాల కొనుగోలు కోసం దుకాణాల ఎదుట బారులు దీరుతున్నారు. ఈ సీజన్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 9.67 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసిన అధికారులు.. అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచారు. రెండు జిల్లాల్లో కూడా 6.19 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన వ్యవసాయ రంగాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతులకు వరంగా మారాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 85 శాతం పేద రైతులు ఉండగా రైతుబంధు, రైతుబీమా, సకాలంలో విత్తనాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయానికి 24 గంటల సాగునీరు, పంటల కొనుగోళ్ల లాంటివి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గతంలో భూములు ఉన్నా వ్యవసాయం చేయని రైతులు ఏడేళ్లుగా పంటలు సాగుచేస్తూ ఉపాధిని మెరుగుపర్చుకుంటున్నారు. సర్కారు అన్నదాతలకు ఇస్తున్న ప్రోత్సాహంతో జిల్లాల్లో పంటల సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. ఈ రెండు జిల్లాల్లో రైతులు వానకాలం సీజన్లో ఎక్కువగా పత్తి, వరి, సోయాబీన్, కంది పంటలు సాగు చేస్తుంటారు. యాసంగిలో వరి, శనగ, జొన్న, పల్లి, గోధుమ పంటలు వేస్తుంటారు.
9.67 లక్షల ఎకరాల్లో పంటలు…
ఈ సీజన్లో రెండు జిల్లాల్లో 9.67 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 5.72 లక్షల ఎకరాలు, నిర్మల్ 3.95 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేయనున్నారు. రెండు జిల్లాల్లో ఎక్కువగా పత్తి 6.19 లక్షల ఎకరాల్లో వేయనున్నారు. గతేడాది పత్తి పంటల దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో పాటు క్వింటాలుకు రూ .5825 చొప్పున ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు పంటను విక్రయించి లాభాలు పొందారు. ఈ ఏడాది 56 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు విస్తీర్ణం పెరుగనుంది. వరి 1.05 ఎకరాలు, సోయాబీన్ 1.10 లక్షల ఎకరాలు, కంది 1.40 లక్షల ఎకరాల్లో సాగవనున్నట్లు అధికారులు అంచనా వేశారు. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. బుధవారం రెండు జిల్లాల్లో మోస్తరు వర్షం పడింది. గురువారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి విత్తనాలు కొనుగోలు చేయడానికి భారీ సంఖ్యలో రైతులు దుకాణాలకు తరలి రావడంతో జిల్లా కేంద్రంలో సందడి కనిపించింది. ఈ నెల 15 నుంచి ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఎకరాకు రూ.5వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుండగా వ్యాపారులు సైతం రైతులకు ఉద్దెరపై విత్తనాలు ఇస్తున్నారు.
అందుబాటులో ఎరువులు
ఎరువుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. సీజన్లో ఆదిలాబాద్ జిల్లాలో యూరియా 34 వేల టన్నులు, డీఏపీ 13 వేల టన్నులు, ఎంవోపీ 7 వేల టన్నుల, కాంప్లెక్స్ ఎరువులు 36 వేల టన్నులు, ఎస్ఎస్పీ 4 వేల టన్నుల వినియోగం జరుగనుండంగా, నిర్మల్ జిల్లాలో 34 వేల టన్నుల యూరియా, 3 వేల టన్నుల డీఏపీ, 10,200 మెట్రిక్ టన్నులు ఎరువులను రైతులు వినియోగించే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నెలల వారీగా ఎరువుల విక్రయాలుంటాయని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.