
యైటింక్లయిన్ కాలనీ, జనవరి 2 : ఎన్నో దశాబ్దాలుగా రామగుండం నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అయిన మెడికల్ కళాశాల ఏర్పాటు సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆర్జీ-2 డివిజన్లోని ఓసీపీ-3 కృషిభవన్‌లో ఆదివారం జరిగిన గేట్ మీటింగ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు అగ్రభాగాన ఉండి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆ కార్మికుల త్యాగాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కార్మిక వర్గంపై ఎంతో ప్రేమ చూపుతూ అనేక వరాలు కురిపించి అక్కున చేర్చుకున్నారని పేర్కొన్నారు. నాటి ఆంధ్ర పాలకులు సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాలను పోగొడితే వాటి స్థానంలో కారుణ్య నియామకం అమలు చేసి కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. గతంలో పెండింగ్‌లో ఉన్న 3,500 మంది డిపెండెంట్లకు ఒకే దఫా ఉద్యోగాలు ఇచ్చి అండగా నిలిచారన్నారు. పారిశ్రామిక ప్రాంత కార్మికులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో సంస్థ సీఅండ్ఎండీతో మాట్లాడి మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం రూ.500 కోట్లను విడుదల చేయించిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. కార్మిక సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో సానుకూలంగా ఉన్నారని తెలిపారు. పోతన కాలనీ నుంచి 8వ కాలనీకి వచ్చే రోడ్డు తొందరగా పూర్తి చేయాలని, నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. దీంతో వెం టనే సింగరేణి డైరెక్టర్, స్థానిక జీఎంతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేయాలని కోరగా.. అధికారులు నీటి సమస్యను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రోడ్డు సమస్యను 15 రోజుల్లోగా పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అనంతరం నూ తన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించి కార్మికులకు అందజేశారు. ఆర్జీ-2 డివిజన్ టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, కేంద్ర కమిటీ నాయకులు కొత్త సత్యనారాయణరెడ్డి, కార్పొరేటర్ బదావత్ శంకర్‌నాయక్, జాహిద్‌పాషా, కృష్ణ, బానాకర్, శ్రీనివాస్, ఇటికాల బాలయ్య, బేతి చంద్రయ్య, ఏ రవీందర్‌రెడ్డి, ఆకుల రాజయ్య, సమ్మయ్య, సత్యనారాయణ, రంగిశెట్టి వెంకన్న, లింగారెడ్డి, రాజిరెడ్డి, సూర్యశ్యాం, సంజీవ్, రాజమౌళి, కార్మికులు పాల్గొన్నారు.