
.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,08,959 ఎకరాల అంచనా
ఆన్లైన్లో పూర్తి వివరాలు నిక్షిప్తం
ఈ నెల 8 వరకు అవకాశం
నిరంతరం పర్యవేక్షిస్తున్న కలెక్టర్లు, ఇతర అధికారులు
ఆదిలాబాద్, డిసెంబర్ 1 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోడుభూములకు పట్టాల పంపిణీలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జోరుగా సాగుతున్నది. గత నెల 8న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, అటవీ భూములను సాగు చేస్తున్న గిరిజన రైతాంగం సద్వినియోగం చేసుకుంటున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,08,959 ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నట్లు గుర్తించిన అధికార యంత్రాంగం, ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. అటవీ, పంచాయతీ, రెవెన్యూ, ఫారెస్ట్ రైట్స్ కమిటీ సభ్యుల సమన్వయంతో గ్రామాల్లో ఈ కార్యక్రమం సాగుతుండగా, పూర్తి వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. కలెక్టర్‌తో పాటు జిల్లాస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీభూములు సాగు చేస్తున్న గిరిజన రైతులకు పట్టాల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా అటవీ భూముల్లో పంటలు పండిస్తున్న గిరిజనులకు హక్కు పత్రాల పంపిణీ ప్రక్రియ చేయడానికి అధికారులు నవంబర్ 8 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 8 వరకు గ్రామాల్లో పోడు భూములు సాగు చేస్తున్న వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. ఉమ్మడి జిల్లాలో 1,08,959 ఎకరాల అటవీభూముల్లో వ్యవసాయం చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో 56,140 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 19,543 ఎకరాల్లో ఆక్రమణ, మంచిర్యాల జిల్లాలో 8,276 ఎకరాల్లో పోడు వ్యవసాయం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 25 వేల ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నట్లు నిర్ధారించారు. 2005, డిసెంబర్ 13 నాటికి అటవీభూములు సాగు చేస్తున్న వారిని గుర్తించి వారికి పట్టాలు పంపిణీ చేయనున్నారు.
గ్రామాల్లోనే దరఖాస్తుల స్వీకరణ..
అటవీ భూములకు హక్కు పత్రాల పంపిణీలో భాగంగా అధికారులు గిరిజన గ్రామాల్లో స్థానికుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో అటవీ, పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది, గ్రామాల్లోని ఫారెస్ట్ రైట్స్ కమిటీ సభ్యులు సహకారం అందిస్తున్నారు. పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులు దరఖాస్తు ఫారంతో పాటు సంబంధిత పత్రాలు అందజేస్తున్నారు. ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, రేషన్‌కార్డు నంబర్, జీవిత భాగస్వామి పేరు, తండ్రి, తల్లి పేరు, అడ్రస్, గ్రామంలో హక్కు కోరుతున్న భూమి వివరాలు, ఎస్టీ ధ్రువీకరణ పత్రం, అర్జీదారుడి కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, ఆధార్ నంబర్లు, అటవీ భూమి విస్తీర్ణం, స్వయంగా సాగు చే స్తున్నది, ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నదనే వివరాలు తెలియజేయాలి. గ్రామ పెద్దల వాంగ్మూలం కాపీని జతపరుస్తున్నా రు. దరఖాస్తు దారులకు ఫారెస్ట్ రైట్స్ కమిటీ సభ్యులు రసీదు ఇస్తారు.
పకడ్బందీ పర్యవేక్షణ..
పట్టాల దరఖాస్తు ప్రక్రియను అధికారులు పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. కలెక్ట ర్లు, అదనపు కలెక్టర్లు, అటవీశాఖ అధికారు లు, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గ్రా మాల్లో పర్యటిస్తూ క్లెయిమ్స్ స్వీకరణను పరిశీలిస్తున్నారు. గ్రామాల్లో తీసుకున్న దరఖాస్తులను ఆయా మండలాల ఎంపీడీవో కా ర్యాలయాల్లో సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని, అర్హులందరికీ పట్టా లు అందేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సిబ్బందికి సూచిస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా తాము సాగు చేస్తున్న భూములకు పట్టాలు వస్తుండడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
49,184 ఎకరాలకు దరఖాస్తులు..
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు జిల్లాలో 13461 మంది రైతులు 49184 ఎకరాలకు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులతోపాటు గిరిజనేతరులు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఇప్పటి వరకు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి 7024 మంది రైతులు 27204 ఎకరాలకు పట్టాలకు దరఖాస్తులు చేసుకున్నారు. సిర్పూర్ నియోజకవర్గం నుంచి 6437 మంది రైతులు 21980 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో పోడు భూములు సాగుసుకుంటున్న వారు దాదాపు 10 వేల మంది రైతులు ఉంటారని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటికే 13,461 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 8 వరకు స్వీకరణకు గడువు ఉండగా, దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
మొక్కల పెంపకం చేపట్టాలి
తలమడుగు, డిసెంబర్ 1: గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టాలని డీఆర్డీవో కిషన్ అధికారులు, పంచాయతీ సిబ్బందికి సూచించారు. మండలంలోని కజ్జర్ల గ్రామంలో చేపడుతున్న నర్సరీ పనులతో పాటు పల్లె ప్రకృతి వనాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ నర్సరీ పనులను ప్రతి రోజూ మండల అధికారులు, పంచాయితీ సిబ్బంది పరిశీలించాలని ఆదేశించారు. పల్లె ప్రకృతి వనం బాగుందని పంచాయతీ సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట ఏపీడీ రవీందర్, ఎంపీడీవో రమాకాంత్, ఏపీవో శ్యాముల్, ఈసీ గంగాధర్, ఉపసర్పంచ్ ప్రశాంత్, సెక్రటరీ సునీత ఉన్నారు.
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని డీఆర్డీవో కిషన్ సూచించారు. బరంపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్ జూనియర్ బాలబాలికల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబడ్డీ పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, ఏపీడీ రవీందర్, ఎంపీడీవో రమాకాంత్, మండల విద్యాశాఖ అధికారి నారాయణ, ఎస్ఐ ప్రవళిక, ప్రధానోపాధ్యాయుడు మహేందర్ యాదవ్, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ కేదారేశ్వర్ రెడ్డి, పీఈటీ జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.