
నిర్మల్ టౌన్, నవంబర్ 1: బృహత్ పల్లె ప్రకృతివనాలను వేగంగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో బృహత్ పల్లె ప్రకృతివనాలు, హరితహారంలో మొక్కల సంరక్షణ తదితర అంశాలపై జిల్లాస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో 19 మండలాల్లో ఇప్పటికే పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో బృహత్ పల్లె ప్రకృతివనాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో ప్రకృతివనాలు పూర్తయ్యాయి, పనులు జరుగుతున్న ప్రదేశాలు, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. స్థలాల కొరత ఉంటే వెంటనే రెవెన్యూ అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. హరితహారంలో భాగంగా ఆయా గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మొక్కలు ఎండిపోకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లతో నీటిని సరఫరా చేయాలని, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటించాలని సూచించారు. మొక్కలు ఎండిపోతే సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో వికాస్ మీనా, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీపీవో వెంకటేశ్వర్రావు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు అనుమతులివ్వాలి
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 29 : జిల్లాలో అటవీ శాఖతో ముడిపడి ఉన్న పలు అభివృద్ధి పనులకు అనుమతులను వెంటనే ఇవ్వాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సంబందిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో అటవీ, పంచాయతీరాజ్, విద్యుత్, ఇరిగేషన్ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ శాఖ పరిధిలో చేపడుతున్న సాగునీటి కాలువలు, రోడ్లు, విద్యుత్ సరఫరా లైన్లు, పెండింగ్ పనులను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. 43 గ్రామాలకు అటవీ ప్రాంతం ద్వారా విద్యుత్ లైన్ వెళ్తున్నందున సింగిల్ ఫేజ్ నుంచి త్రీఫేజ్ లైన్ మార్చుటకు 37 గ్రామాల్లో పని పూర్తయిందని, మిగిలిన 6 గ్రామాల్లో వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద మంజూరైన రోడ్లలో ఏడు అటవీ ప్రాంతంలో ఉన్నందున అటవీ శాఖ అనుమతులకు ప్రతిపాదనలు పంపగా స్టేజ్ వన్‌లో ఆర్అండ్బీ రోడ్డు నుంచి కొసగుట్ట మీదుగా యాపల్‌గూడ రోడ్డుకు అనుమతి వచ్చిందని తెలిపారు. కాళేశ్వరం నుంచి మామడ వరకు 27 ఫేజ్ కింద మంజూరైన కాలువ నిర్మాణ పనులకు అటవీ శాఖ అనుమతికి ప్రతిపాదనలు పంపామని, వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, డివిజన్ ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ్, ఎఫ్‌డీవో కోటేశ్వర్ రావు, పంచాయతీ ఈఈ రామారావు, విద్యుత్ శాఖ ఎస్ఈ జయవంత్ చౌహాన్ తదితరులున్నారు.