
నిర్మల్ టౌన్, నవంబర్ 1: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో వచ్చిన అర్జీల పరిష్కారంలో జాప్యం చేయవద్దని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని అధికారులతో కలిసి నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు వచ్చిన అర్జీలను స్వీకరించిన ఆయన వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధ్యాయులను నియమించాలి..
భైంసా మండలం తిమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు విద్యనందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వీడీసీ సభ్యులు సోమవారం అదనపు కలెక్టర్ రాంబాబుకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగినప్పటికీ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థులు నష్టపోతున్నారని వివరించారు. స్పందించిన అదనపు కలెక్టర్ అక్కడే ఉన్న డీఈవో రవీందర్‌రెడ్డిని పిలిచి పాఠశాలను సందర్శించి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
దవాఖానలో సౌకర్యాలు కల్పించండి…
ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన సేవలందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఎంఐఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేకు వినతిపత్రం అందించారు. నాయకులు అజీంబిన్యాహియా, ఉస్మాన్, మజార్, మహ్మద్ ఫారూక్, మజారుద్దీన్ పాల్గొన్నారు.
బాధ్యతగా పని చేస్తే సమాజంలో గుర్తింపు
ఉద్యోగులు బాధ్యతగా పనిచేస్తే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని అదనపు కలెక్టర్ రాంబాబు పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ఉద్యానవనశాఖాధికారిగా విధులు నిర్వహించి హైదరాబాద్‌కు బదిలీపై వెళ్తున్న శరత్‌బాబును జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. జిల్లాలో శరత్‌బాబు చేసిన సేవలను కొనియాడారు. జిల్లా అధికారులు మల్లికార్జున్, సుధీర్‌కుమార్, వెంకటేశ్వర్లు, ధన్‌రాజ్, హన్మాండ్లు, రమేశ్‌కుమార్, రాజేశ్వర్‌గౌడ్, నర్సింహారెడ్డి, సృజయ్కుమార్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.