
బోథ్, నవంబర్ 1: పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ నటరాజన్ ఆదేశించారు. సోమవారం బోథ్‌లోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెటింగ్ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… పత్తిలో తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు గ్రామాలకు వచ్చి పత్తి కొనుగోలు చేస్తున్నందున తూకాల్లో రైతులు మోసపోకుండా చూడాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. లైసెన్స్‌లేని వ్యాపారులు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ శివరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, ఇన్చార్జి కార్యదర్శి రాము, సూపర్వైజర్ గంగన్న, ఏఎంఎస్ స్వామి, వ్యాపారులు కత్తూరి మల్లేశ్, కత్తూరి విశ్వానంద్, కత్తూరి సంపత్, కత్తూరి రూపేశ్‌కుమార్, కైలాస్సింగ్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావాణి
ఎదులాపురం, నవంబర్ 1: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించామని ఆయన తెలిపారు. ఇక్కడ ఆర్డీవో రాజేశ్వర్, జడ్పీ సీఈవో గణపతి , ఏపీడీ రవీందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, సంక్షేమ శాఖల అధికారులు రాజలింగం, కృష్ణవేణి, మిల్కా, శంకర్ కలెక్టరేట్ పర్యవేక్షకులు నలంద ప్రియ, స్వాతి తదితరులు పాల్గొన్నారు.