
బేల, నవంబర్ 1 : ఆదివాసుల ఆరాధ్య దైవం కుమ్రం భీం ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. మండలంలోని చంద్పెల్లిలో సోమవారం కుమ్రం భీం వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులతో కలిసి భీం చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మనోహర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ , ఎమ్మెల్యే జోగురామన్న ఆదివాసుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. పోడు భూములకు పట్టాలు అందించడంతో పాటు రైతు బంధు ఇచ్చి ఆదుకుంటున్నారన్నారు. దీపావళి సందర్భంగా నిర్వహించే దండారీ ఉత్సవాలకు రూ. 10 వేల చొప్పున మం జూరు చేశారని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యంతో పాటు కమ్యూనిటీ షెడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారన్నారు. చంద్పెల్లి గ్రామంలో రూ. 5 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ షెడ్డును మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. భీం వర్ధంతి సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేసిన అడనేశ్వర్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పవర్ అక్షిత, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు జక్కుల మధుకర్, జంగ్శౌవ్, సాకరం విఠల్ వారడే, దౌలత్ పటేల్, తన్వీర్ ఖాన్, గ్రామ పటేల్ సోనేరావు, ఆదివాసీ నాయకులు తానాజీ , సురేశ్ పాల్గొన్నారు.