
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం కావాలి
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్
నాలుగు జిల్లాల పరిధిలో పర్యటన
చనాకా-కొరాట, సదర్మాట్, వార్దా బ్యారేజీల సందర్శన
పనులపై అధికారులు, కాంట్రాక్టర్లకు సూచనలు
శెట్పల్లి వద్ద పంప్‌హౌస్ ప్రతిపాదిత స్థల పరిశీలన
ఆయా చోట్ల వెంట ప్రభుత్వ విప్ సుమన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కలెక్టర్లు
మామడ, ఫిబ్రవరి 1 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ వేగంగా పూర్తి చేసి, లక్షలాది ఎకరాలకు నీరందించి రైతాంగానికి మేలు చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని చనాకా-కొరాట, నిర్మల్ జిల్లాలోని సదర్మాట్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వార్దా బ్యారేజీలను మంగళవారం వారు ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో కలిసి పరిశీలించారు. నాలుగు జిల్లాల పరిధిలో ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని చెప్పారు. పనుల పురోగతిపై ఆరా తీసి, అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్పల్లి వద్ద పంప్‌హౌస్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఆయా చోట్ల వారి వెంట ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కలెక్టర్లు ఉన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ వేగంగా పూర్తి చేసి, లక్షలాది ఎకరాలకు నీరందించి రైతాంగానికి మేలు చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ సమీపంలో గోదావరి నదిపై చేపడుతున్న సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. అంతకుముందు సీఎంవో కార్యదర్శికి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్ స్వాగతం పలికారు. పనులు పరిశీలించిన అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనుల వివరాలను ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. పనుల వివరాలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఏప్రిల్ నెలాఖరులోగా సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని 18వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించామని తెలిపారు. డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రాజత్ కుమార్, ఈఎన్సీ వెంకటేశ్వర్లు, సీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఈ సునీల్‌కుమార్, ఈఈ రామారావు, కాంట్రాక్టర్లు శ్రీకాంత్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, ఎస్డీసీ స్రవంతి, ఆర్డీవో రమేశ్, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు రాంకిషన్‌రెడ్డి, సర్పంచ్ భూమేశ్వర్, తహసీల్దార్ కిరణ్మయి, ఎంపీడీవో మల్లేశం, ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌గౌడ్, శశికాంత్ పాల్గొన్నారు.
జూన్‌లోగా సాగునీరు అందిస్తాం
జైనథ్, ఫిబ్రవరి 1 : లోయర్ పెన్‌గంగ నదిపై నిర్మించిన చనాకా- కొరాట బ్యారేజీ కాలువల ద్వారా జూన్‌లోగా సాగునీరు అందిస్తామని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌లతో కలిసి హెలికాప్టర్ ద్వారా జైనథ్ మండలం హత్తిఘాట్ పంప్‌హౌజ్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో చనాకా- కొరాట బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. తర్వాత బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించి పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్, జైనథ్, తాంసి ,బేల మండలాల్లోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందతుందన్నారు. పంప్‌హౌజ్ పనులను గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భీంపూర్ మండలం పిప్పల్‌కోటి వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం డబ్బులు విడుదల చేస్తామన్నారు. మంత్రి వెంట ఇరిగేషన్ సీఎస్ రజత్‌కుమార్, సీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాపురావ్, డెయిరీ చైర్మన్ భూమారెడ్డి, జడ్పీ చైర్మన్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ప్రాజెక్టు ఈఈ రవీందర్, ఎంపీపీ గోవర్ధన్ ఉన్నారు.