
ఏర్పాటుతో ఎంతో ప్రయోజనం
పెరుగనున్న రైళ్ల సంఖ్య
పలు ప్రాంతాలకు వెళ్లే అవకాశం
ఇక్కడే రైలు బోగీల నిర్వహణ
ఆదిలాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ సువిశాలమైన ప్రదేశంలో విస్తరించి ఉంది. దీనికితోడు ఇక్కడి నుంచి అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌కు రైల్వే నిర్వహణ కేంద్రం (పిట్‌లైన్) మంజూరు చేస్తూ రైల్వే కమిటీ ఆమోదం తెలిపింది. రూ.17.97 కోట్లతో దీనిని ఏర్పాటు చేయనుండగా, రైల్వే బోర్డు చివరి అనుమతి లభించాల్సి ఉంది. మున్ముందు ఆదిలాబాద్ వచ్చే రైళ్ల సంఖ్య పెరగడంతో పాటు బోగీల నిర్వహణ కూడా ఇక్కడే చేపట్టే వీలుంటుంది.
ఆ దిలాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పలు రాష్ర్టాలతో పాటు తిరుపతికి రైళ్ల రాకపోకలు కొనసాగుతాయి. జిల్లా ప్రజలు రైలు మా ర్గం ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రయాణం సాగిస్తారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు, రోజువారీ కూలీ పనులు, అనారోగ్య సమస్యలతో జిల్లా కేంద్రానికి రైళ్లలో వస్తారు. జిల్లా ప్రజలతో పాటు మహారాష్ర్ట వాసులకు రైలు ప్ర యాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. తిరుపతి, షిర్డీ లాంటి పుణ్యక్షేత్రాలకు సైతం ప్రజలు రైలు ప్రయాణాన్ని ఇష్టపడుతారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌కు 76 ఎకరాల స్థలం ఉండడంతో ఇక్కడ రైల్వే శాఖ పలు పనులు చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇక్కడ రైల్వే నిర్వహణ కేంద్రాన్ని (పిట్‌లైన్) మంజూరు చేస్తూ రైల్వే కమిటీ ఆమోదం తెలిపిం ది. రైల్వేబోర్డు చివరి అనుమతి లభించాల్సి ఉంది. రాళ్ల రాకపోకలు ఎక్కువగా ఉన్న చోట పిట్‌లైన్‌ను మంజూరు చేస్తారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ 76 ఎకరాల్లో విస్తరించి ఉండడం, ఇతర సౌకర్యాలు ఉండడంతో పిట్లైన్కు అనుకూలంగా ఉం ది. లైన్ ఏర్పాటులో భాగంగా రూ.17.97 కోట్లు కేటాయించనుండడంతో ఇందుకు సంబంధించిన పనులు చేపడుతారు. విద్యుత్ సౌకర్యం కల్పించడం, రైలు డబ్బాల నిర్వహణ జరిగేలా చేస్తారు.
పలు ప్రాంతాలకు రైళ్లు..
ప్రయాణికుల భద్రతలో భాగంగా రైల్వేశాఖ అధికారులు నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించే రైళ్లకు నిర్వహణ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా పిట్‌లైన్ ఏర్పాటు చేస్తారు. నిర్వహణలో భాగంగా చక్రాలను పరిశీలించి మరమ్మతులు చేయడం, రైళ్లతో పాటు మరుగుదొడ్లను శుభ్రపర్చడం, నీటితో కడగడం, కప్లింగ్‌లు సరిగా ఉన్నాయా లేదా అని చూడడం లాంటి చేస్తారు. ఆదిలాబాద్‌కు పిట్‌లైన్ మంజూరు కావడంతో ఇక్కడికి నిర్వహణకోసం పలు రైళ్లు వస్తుంటాయి. దీంతో రైళ్ల సంఖ్య పెరుగుతుంది. వివిధ ప్రాంతాలకు పోయి రైళ్లు ఆదిలాబాద్‌కు వచ్చే అవకాశాలుండడంతో జిల్లా వాసులు తమ పనుల కోసం ఇతర ప్రాంతాలకు పోవచ్చు. పిట్‌లైన్ ఏర్పాటుతో రైలు ప్రయాణికులకు ఎంతో సౌకర్యం ఉంటుందని స్థానికులు అంటున్నారు.