
నేటి నుంచి మార్పులు చేర్పులు
జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు
డిసెంబర్ 20 వరకు సవరణలు
జనవరి 5 వరకు కొత్త, 15న తుది జాబితాలు
కుమ్రం భీ ఆసిఫాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ)/ మంచిర్యాల, అక్టోబర్ 30, నమస్తే తెలంగాణ : ఓటర్ల జాబితా సవరణ -2022కు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సోమవారం నుంచి ప్రక్రియ ప్రారంభించనున్నది. జనవరి 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండిన వారందరినీ కొత్త ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు చనిపోయిన వారి వివరాలు తొలగించడం, చిరునామాల మార్పువంటివి చేపట్టనున్నది. డిసెంబర్ 20వ తేదీ నాటికి పూర్తి చేసి, జనవరి 5 నాటికి కొత్త ఓటర్ల జాబితాను తయారు చేసి.. 15 నాటికి తుది జాబితా సిద్ధం చేయనున్నది.
ఓటర్ల జాబి తా సంక్షిప్త సవరణకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికారులకు సూచనలు ఇచ్చేందుకు జిల్లాకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి శశాంక్ గోయల్ ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు మార్గదర్శనం చేశారు. ఈ మేరకు నాలుగు రోజుల క్రితం కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులు, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాను పకడ్బందీగా తయారు చేయాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. కొత్తగా తయారు చేసే ఓటర్ల జాబితాలో అన్ని రకా ల సవరణలు చేయనున్నారు. చనిపోయిన వారివి తొలగించడంతోపాటు జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరినీ ఓటరు లిస్ట్‌లో చేర్చనున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న 335 గ్రామ పంచాయతీల్లో అధికారులు సర్వే చేపట్టి కొత్త ఓటర్ లిస్ట్‌లను తయారు చేయనున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి పేర్లును నమోదు చేసుకోనున్నారు. దీంతోపాటు రెండు, మూడు ఎపిక్ కార్డులు కలిగి ఉన్నా, చిరునామాలు మారినా, మృతి చెందిన వారి వివరాలను తొలగిస్తారు. పేరు, చిరునామాలో ఏమైనా సవరణలుంటే సరిచేసుకొనేలా ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
గరుడ యాప్ వినియోగం..
జిల్లాలో బూత్ స్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్న చోట్ల భర్తీచేయనున్నారు. ఓటర్ల నమోదుకు సంబంధించి గరుడ యాప్ నిర్వహణపై సిబ్బందికి వివరించనున్నారు. ఓ టర్ల జాబితా తయారీలో అన్ని రాజకీయ పార్టీల నుంచి ఏజెంట్లను నియమించనున్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా సిద్ధం చేసేందుకు ఏజెంట్ల సహకారాన్ని తీసుకోనున్నారు. జనవరి 15 నాటికి కొత్త ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో తయారు చేయనున్నారు. 2018 ఎన్నికల సమయంలో జిల్లాలో 3 లక్షల 71 వేల 444 మంది ఓటర్లున్నారు. మూడు సంవత్సరాలు కాలంలో 18 ఏళ్లు నిండిన వారు కొత్త ఓటర్లుగా చేరనున్నారు. ఈ జాబితా సవరణ తర్వాత జిల్లాలో ఓటర్లు 4 లక్షలు దాటే అవకాశాలున్నాయి.
మంచిర్యాల ఓటర్ల వివరాలు..
మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా సాధారణ పురుష ఓటర్లు 2,95,764 మంది, మహిళలు 2,92,650 మంది, ఇతరులు 43 మంది కలిపి మొత్తంగా 5,88,457 మంది ఓటర్లున్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లు 27 మంది, సర్వీస్ ఓటర్లు 567 మంది ఉన్నారు.