
పద్మల్‌పురి కాకో ఆలయంలో వైభవంగా సంబురాలు
అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఆదివాసీల అభ్యున్నతికి సర్కారు కృషి
ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, సక్కు, మాజీ ఎంపీ నగేశ్
దండేపల్లి, అక్టోబర్ 31 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి నది ఒడ్డున ఉన్న పద్మల్‌పురి కాకో ఆలయంలో ఆదివారం నిర్వహించిన గుస్సాడీ దర్బార్‌కు భక్తులు పోటెత్తారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఉదయమే ఆలయానికి చేరుకున్న భక్తులు గోదావరి నది ఒడ్డున ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర జలాలను కాకో వద్దకు తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. అమ్మవారికి పవిత్రమైన కానుగ నూనెలో తయారుచేసిన గారెలను నైవేద్యంగా అందించారు. కొత్తగా పెళ్లయిన జంటలకు అమ్మవారి ముందు భేటీ ఉంచారు. కొత్తకోడళ్లను అమ్మవారికి పరిచయం చేయించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహికంగా విందు భోజనాలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచేగాక ఇతర ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి గోండ్, ప్రధాన్, కోలాం, తోటి, తదితర ఆదివాసీ గిరిజనులు ఈ వేడుకలో పాల్గొన్నారు. గుస్సాడీ బృందాల నృత్యాలతో ఆలయ ఆవరణ మారుమోగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
ఆదివాసుల అభ్యున్నతికి సర్కారు ప్రాధాన్యం
ఎమ్మెల్యేలు దివాకర్‌రావు,ఆత్రం సక్కు, మాజీ ఎంపీ నగేశ్
ఆదివాసుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, ఆత్రం సక్కు, మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. గుడిరేవు గోదావరి ఒడ్డున ఉన్న పద్మల్‌పురి కాకో ఆలయంలో ఆదివారం జరిగిన గుస్సాడీ దర్బార్‌కు ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. సం స్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పద్మల్‌పురి ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.36 లక్షలు మంజూరు చేసిందన్నారు. ఆదివాసుల ఆత్మగౌరవానికి ప్రతీకైన కుమ్రం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు జోడెఘాట్‌ను అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. ఐటీడీఏ చైర్మన్ లక్కెరా వు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ అమ్మవారిని దర్శించుకున్నారు. నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, వైస్ ఎంపీపీ అనిల్, సర్పంచ్ చిట్ల లింగవ్వ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బియ్యాల తిరుపతి, ఆలయ చైర్మన్ కుడిమెత సోము,మాజీ సర్పంచ్ చిట్ల మంజుభార్గవి, ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు కోట్నాక తిరుపతి, రాయి సెంటర్ జిల్లా సభ్యుడు పెందురు రాంపటేల్, తుడం దెబ్బ మండల అధ్యక్షుడు కన్నాక జంగు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న ఉన్నారు.