
నార్నూర్, అక్టోబర్ 31 : ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించే పనులను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రజలకు సూచించారు. గాదిగూడ మండలంలోని దాబా(కే) రైతువేదిక భవనంలో ఆదివారం ఎన్ఆర్ఈజీఎస్ గ్రామసభ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ హాజరయ్యారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రైతులు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు, ప్రజల అభిప్రాయాల మేరకు పనులు గుర్తించి, వచ్చే ఏడాదికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అనంతరం పల్లెప్రగతిలో భాగంగా డంప్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. పల్లెప్రకృతివనంలో మొక్కలు ఎండిపోకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. బృహత్ ప్రకృతి వనం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అంతకుముందు జాబ్‌కార్డు పొందిన కూలీలు, రైతులనుంచి పనుల వివరాలు సేకరించారు. సమావేశంలో సర్పంచ్ సిడా ఆనంద్‌రావ్, ఎంపీడీవో రామేశ్వర్, ఎంపీవో సాయిప్రసాద్, పీఆర్ ఏఈ జాడి లింగన్న, ఈజీఎస్ ఏపీవో జాదవ్ శేషారావ్, వ్యవసాయాధికారి జాడి దివ్య, ఈసీ అమర్‌సింగ్, టెక్నికల్ అసిస్టెంట్ మోతీరామ్ తదితరులు పాల్గొన్నారు.